విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండరామస్వామి విగ్రహ ధ్వంసం ఘటనపై నిరసనగా బీజేపీ, జనసేన పిలుపునిచ్చిన చలో రామతీర్థం ఉద్రిక్తంగా మారుతోంది. యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న నేతలని పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. గుంటూరులో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గృహనిర్బంధం చేశారు. విశాఖలో మాజీ ఎమ్మెల్యే విష్ణకుమార్ రాజుకు సెక్షన్ 151 ప్రకారం నోటీసులు అందజేసి… ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు. ఇరు పార్టీలకు చెందిన ఇరవై మందికి పైగా ముఖ్య నేతలకు ముందస్తు నోటీసులు ఇచ్చి.. ఎక్కడికక్కడ పోలీసులు వారిని హౌస్ అరెస్ట్ చేశారు.
రామతీర్థం ధర్మయాత్రలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొంటారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే పవన్ హాజరుపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. మరోవైపు ఈ కార్యక్రమానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన నేతలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ధర్మయాత్రను నిర్వహించి తీరతామని స్పష్టం చేస్తున్నారు.