విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. కోదండరాముడి విగ్రహ ధ్వంసం ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన పిలుపునిచ్చిన ధర్మయాత్రను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలను హౌస్ అరెస్ట్ చేయగా.. రామతీర్థం జంక్షన్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వాహనాన్ని పోలీసులు నిలువరించారు. దీంతో బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య చాలాసేపు తోపులాట జరగింది. ఈ క్రమంలో సోము వీర్రాజు కిందపడిపోయారు.
ఆలయాన్ని సందర్శించే తీరతామని సోము వీర్రాజు ముందుకు సాగగా.. పోలీసులు వెళ్లనివ్వలేదు. సెక్షన్ 30 అమల్లో ఉందని.. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని ఆయనకు చెప్పారు. దీంతో సోము వీర్రాజు వారితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో.. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌కు సోము వీర్రాజును తరలించారు.