– ఈడీ విచారణకు కవిత
– ఢిల్లీకి భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు
– 144 సెక్షన్ విధించిన పోలీసులు
– పిళ్లై, సిసోడియా, కవిత ఒకే బిల్డింగ్ లో!
– వేర్వేరు రూముల్లో ఈడీ విచారణ
– కొత్త పేర్లు తెరపైకి రానున్నాయా?
క్రైంబ్యూరో, తొలివెలుగు:తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత.. ఈడీ విచారణ ఎదుర్కోవడం ఉత్కంఠను రేపుతోంది. మహిళలను ఇంటికి వచ్చి విచారించాలని డిమాండ్ చేసినా.. అధికారులు ఆ దిశగా ఆలోచన చేయకపోవడంతో ఈడీ ఆఫీస్ కి వెళ్లారు కవిత. అరెస్ట్ వార్తల నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ ప్రధాన అనుచరులు ఢిల్లీకి చేరుకున్నారు. ఈడీ ఆఫీస్ పరిసరాల్లో ఎలాంటి ధర్నాలు, నిరసనలు తెలపకుండా ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు.. పార్టీ ఆఫీస్ దగ్గర భారీ ధర్నా చేపట్టారు.
కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కవిత విచారణ నేపథ్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే.. హైదరాబాద్ లో మాత్రం ఇవి కుదరవు కాబట్టి.. ఢిల్లీ కేంద్రంగానే ధర్నాలు జరిగే అవకాశం ఉంది. హైదరాబాద్ లో ఈనెల 13 వరకు నిరసన కార్యక్రమాలు, అనుమతి లేని ధర్నాలను నిషేధిస్తూ పోలీసులు ఉత్తర్వులు ఇచ్చారు.
అరుణ్ రామచంద్ర పిళ్లై తన స్టేట్ మెంట్ ని వెనక్కి తీసుకుంటున్నట్టు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ స్కాంని సవాలుగా తీసుకున్న సీబీఐ, ఈడీ కౌంటర్ దాఖలు చేయనున్నాయి. మెజిస్ట్రేట్ ముందు వాదనలు వినిపించి వీడియో రికార్డులు సమర్పించనున్నట్టు సమాచారం. ఇప్పటికే సిసోడియాని 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు అధికారులు. అలాగే, పిళ్లైని తీసుకుని నాలుగు రోజులయింది. మరో మూడు రోజులు ఆయన కస్టడీలోనే ఉంటారు. ఇప్పుడు కవిత విచారణ సందర్భంగా ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఉంది. ఈ కేసులో సంతోష్ స్నేహితుడు శ్రీనివాసరావు కీలక పాత్ర ఉన్నట్టు గతంలో సీబీఐ పేర్కొంది. వారి ఆఫీసుల్లో తనిఖీలు కూడా జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త పేర్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.
పంజాబ్ ఆప్ ఎన్నికల కోసం 100 కోట్లు సర్దుబాటు చేశారని దర్యాప్తు సంస్థల అభియోగం. ఈడీ ఈ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారనే అంశాన్ని విచారిస్తోంది. అంతేకాకుండా, ఎలా ట్రాన్స్ ఫర్ అయ్యిందన్న దానిపై కూడా ఫోకస్ పెట్టింది. ఈ మొత్తం క్యాష్ ఏవరి వద్ద సమకూర్చారనేది తేల్చనుంది. ఈ క్రమంలో కొత్త ఫండింగ్ లింకులు బయటపడతాయేమో చూడాలి.