గ్రేటర్‌లో కొత్త పాలక మండలి కొలువుదీరే సమయం అసన్నమైంది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకరం, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. అయితే ఏ పార్టీకి గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునే మెజార్టీ లేకపోవడంతో ఏం జరగనుందా అన్న ఉత్కంఠ నెలకొంది. డిసెంబర్‌లో జీహెచ్ఎంసీలోని 150 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ -56 , బీజేపీ- 48, ఎంఐఎం -44, కాంగ్రెస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. ఇందులో ఇటీవల బీజేపీకి చెందిన కార్పొరేటర్ మృతి చెందారు. దీంతో ప్రస్తుతం149 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీరితో పాటు 44 మంది ఎక్స్ అఫిషీయో సభ్యులుగా పేర్లు నమోదు చేయించుకున్నారు. దీంతో మేయర్ ఎన్నికలో పాల్గొనే సభ్యుల సంఖ్య 193కు పెరిగింది.
