కాకతీయ యూనివర్సిటీ ఒక్కసారిగా భగ్గుమన్నది. సంఘర్షణ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో వీసీ కార్యాలయాన్ని ముట్టడించేందకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో రభస మొదలైంది. స్టూడెంట్స్ పోలీసుల నుంచి తప్పించుకొని వీసీ ఆఫీస్ వైపు పరుగులు తీశారు. దీంతో పోలీసులు వారిని ఈడ్చి పారేశారు.
ఈ క్రమంలో పోలీసులు, స్టూడెంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. విద్యార్థులను పోలీసులు యూనివర్సిటీ గేట్ బయటకు తోసేశారు. దీంతో మరింత ఆగ్రహానికి లోనైన స్టూడెంట్స్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరున్న కిటికీల అద్దాలు, పూల కుండీలను ధ్వంసం చేశారు.
అంతటితో ఆగని విద్యార్థులు పోలీసులు ఎంత అడ్డుకున్నా.. వీసీ కార్యాలయానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరు స్టూడెంట్స్ వీసీ భవనం పైకి ఎక్కడంతో మరింత ఉద్రిక్త వాతావరణం యూనివర్సిటీలో నెలకొంది. తరువాత పోలీసులు వారిని కిందికి దించారు. ఇక పెట్రోల్ తో టైర్లు కాల్చేందుకు విద్యార్థులు ప్రయత్నించగా సీఐ వారిని అడ్డుకున్నారు.
అయితే శాంతియుతంగా నిరసన తెలుపుదామనుకుంటే పోలీసులే మొత్తం ఓవర్ యాక్షన్ చేసి తమ పట్ల దరుసుగా వ్యవహరించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మరో వైపు వీసీ బిల్డింగ్ దగ్గర ఇంకా ఉద్రిక్తత కొనసాగుతోంది.