అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ.. పోలీసులకు వ్యతిరేకంగా తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఆమరణ నిరహార దీక్ష చేసేందుకు జేసీ బ్రదర్స్ సిద్ధమయ్యారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. జేసీ దివాకర్ రెడ్డిని ఫామ్ హౌజ్ వద్దనే హౌస్ అరెస్ట్ చేయగా.. ప్రభాకర్ రెడ్డిని ఇంటి వద్దే నిలువరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జేసీ బ్రదర్స్ అనుచరులు, పార్టీ కార్యకర్తలు వారి ఇళ్ల వద్దకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.
మరోవైపు తాడిపత్రిలో ఇప్పటికే 30 యాక్టు,144 సెక్షన్ విధించారు పోలీసులు. ఈ మేరకు పట్టణంలో ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నా కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. జేసీ బ్రదర్స్‌తో పాటు ఎమ్మెల్యే పెద్దా రెడ్డి నివాసాల వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే పోలీసులు అరెస్ట్ చేసినా దీక్ష చేస్తామని జేసీ బ్రదర్స్ చెప్తున్నారు. తాడిపత్రిలో పోలీసులు కవాతు చేసినా భయపడేది లేదంటున్నారు. శాంతియుతంగానే తాము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని.. పోలీసులు అడ్డుకోవడం సరికాదంటూ మండిపడ్డారు.