విశాఖ ఉక్కు పరిశ్రమను 100 శాతం ప్రైవేటీకరిస్తామంటూ పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనతో విశాఖ భగ్గుమంది. నిర్మలా సీతారామన్ ప్రకటనను నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. నిన్న సాయంత్రం నుంచి నిర్విరామంగా తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. నేషనల్ హైవేపై కూర్మన్నపాలెం జంక్షన్‌లోని స్టీల్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద వందలాదిగా మంది ఆందోళనకారులు తరలివచ్చి నిరసన చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కేంద్ర మంత్రి ప్రకటనకు నిరసనగా ఇవాళ విశాఖలోని స్టీల్ ఫ్యాక్టరీ ఆఫీస్ ముట్టడికి కార్మికులు పిలుపునివ్వడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.
కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ సంబంధమూ లేదని నిన్న పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. ఆ పరిశ్రమలో రాష్ట్రానికి ఎలాంటి ఈక్విటీ షేర్ లేదని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే చెందినదని.. అందుకే 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించబోతున్నట్టు పునరుద్ఘటించారు. వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ ఈ మేరకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. దీంతో కార్మికులు ఆందోళనను ఉధృతం చేసే పనిలో పడ్డారు