– కోనసీమ జిల్లా పేరు మార్చొద్దని ఆందోళన
ఏపీలోని కోనసీమ జిల్లా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితులు చివరకు అమలాపురాన్ని రణరంగంగా మార్చాయి. కోనసీమ జిల్లా పేరు మార్చొద్దని గడియారం స్తంభం సెంటర్ వద్ద చేసిన కోనసీమ జిల్లా సాధన సమితి చేసిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
ఆందోళనకారులు అన్ని వైపుల నుంచి వచ్చిన క్రమంలో పోలీసులు వారిని నియంత్రించ లేకపోయారు. బస్టాండ్, ముమ్మిడివరం వైపు నుంచి ప్రదర్శనగా వచ్చిన ఆందోళనకారులు గడియారం స్తంభం వద్దకు చేరుకున్నారు. అలా ఆందోళన కారులు గుమిగూడబోతుండగా పోలీసులు వారిని చెదరగొట్టారు.
పోలీసుల నుంచి తప్పించుకున్న కొందరు యువకులు కలెక్టరేట్ వైపు పరుగులు తీసి అక్కడ బస్సును దగ్ధం చేశారు. ఇక ఆందోళనకారులను తరలించేందుకు రెండు బస్సులను పెట్టగా వాటి అద్దాలనూ ఆందోళన కారులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే ఆందోళన కారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు.
రాళ్ల దాడి నుంచి ఎస్పీ సుబ్బారెడ్డి త్రుటిలో తప్పించుకున్నారు. ఇక ఈ దాడిలో పలువురు పోలీసులు, యువకులకు గాయాలయ్యాయి. ఆందోళనకారులను ఎస్పీ సుబ్బారెడ్డి చెదరగొట్టారు. నల్ల వంతెన వద్ద ఆందోళనకారులపై లాఠీ ఛార్జ్ చేశారు. మరోవైపు బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. అయితే, ముందు జాగ్రత్తగా దాడికి ముందే మంత్రి విశ్వరూప్ కుటుంబ సభ్యులను పోలీసులు కారులో వేరే ప్రాంతానికి తరలించారు.