తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు హైకోర్టు షాకిచ్చింది. ఆయన క్యాడర్ కేటాయింపు వివాదంపై కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలోనే కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది.
రాష్ట్ర విభజన సమయంలో సోమేష్ కుమార్ ను ఏపీకి కేటాయించింది కేంద్రం. కానీ, ఆయన తెలంగాణకే మొగ్గు చూపారు. తనను ఏపీకీ కేటాయించడంపై కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించారు. క్యాట్ ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్నారు. తెలంగాణ సీఎస్ తో పాటు మరో 15మంది ఆలిండియా సర్వీసెస్ అధికారులు కూడా క్యాట్ ఉత్తర్వులతో తెలంగాణలో కొనసాగుతున్నారు.
అయితే.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేయాలని 2017లో హైకోర్టును ఆశ్రయించింది కేంద్రం. తాజాగా దీనిపై వాదనలు జరగగా.. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సీజే ధర్మాసనం తీర్పునిచ్చింది. సోమేష్ కుమార్ న్యాయవాది తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని కోరారు.
కానీ, ఎలాంటి సమయం ఇవ్వలేదు హైకోర్టు. సోమేష్ తరపు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. అయితే.. తీర్పు కాపీ రాగానే ఏపీకి వెళ్లిపోవాలని హైకోర్టు ఆదేశించింది.
సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ తిరిగి వెళ్లాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మొదట్నుంచి చెబుతోంది. ఆయన కంటే సమర్ధులైన అధికారులు తెలంగాణలో లేరని ప్రభుత్వం భావిస్తే ఏపీ సర్కార్ అంగీకారంతో డిప్యూటేషన్ పై రప్పించుకోవాలని సూచిస్తోంది.
విభజన అమల్లోకి వచ్చిన 2014 జూన్ 2కు ముందు రోజు పీకే మహంతి రిటైర్ అయ్యారని, ఆయన పేరును జాబితాలో చేర్చి ఉంటే తాను తెలంగాణ క్యాడర్ లో ఉండేవాడినని సోమేష్ కుమార్ వాదిస్తున్నారు. అయితే.. సర్వీసు పూర్తైన వ్యక్తిని కేటాయింపు జాబితాలో ఎలా చేరుస్తారని ప్రశ్నిస్తూ వస్తోంది కేంద్రం.
మరోవైపు డీజీపీ నియామకంపైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఈమధ్యే నియామకం అయిన అంజనీకుమార్ కూడా ఏపీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తే గనుక సోమేష్ మాదిరిగానే హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యే ఛాన్స్ ఉంది.