-వివాదాస్పద భూముల అమ్మకానికి అత్యుత్సాహం
-కొనుగోలు చేస్తున్న వారికి ఏదీ భరోసా?
– 27,28 తేదీల్లో జరగాల్సిన ఆక్షన్ రద్దు
-పుప్పాలగూడ, ఖానామెట్ భూముల వేలంపై హైకోర్టు స్టే
-కోకాపేట భూములపై వేలాడుతున్న కత్తి
-కాసుల వేటలో గత అనుభవాలను పట్టించుకోని కేసీఆర్ సర్కార్
అత్యాశ కొంపకు చేటు అని తెలిసినా.. తెలంగాణ సర్కార్ పదే పదే అదే అత్యుత్సాహానికి పోతోంది. అధికార బలంతో ఏం చేసినా చెల్లుతుందిలే అనుకుని వివాదాస్పద భూముల వ్యవహారంలో ముందుకెళ్లి.. బొక్కబోర్లపడుతోంది. గత ప్రభుత్వాలు ఎదుర్కొన్న చేదు అనుభవాలు కళ్ల ముందే కనిపిస్తున్నా.. మొండిగా వ్యవహరిస్తూ తీవ్రవిమర్శల పాలవుతోంది. చివరికి కోర్టులతో మొట్టికాయలు తింటేగానీ… సెట్‌రైట్ కావడం లేదు. పుప్పాలగూడ, ఖానామెట్‌లో వివాదాస్పద భూముల వేలంపై హైకోర్టు స్టే విధించడంతో.. సర్కార్‌కు దిమ్మతిరిగినట్టయింది.
ముందు వెనకా చూడకుండా వివాదాస్పద భూములను వేలం వేసి.. ఇప్పటికీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుటోంది. ఫిలింనగర్‌లో అత్యంత విలువైన సర్కార్ భూములని ప్రైవేట్ సంస్థకు కేటాయించాల్సి వచ్చింది. 2007లో అప్పటి ప్రభుత్వం బాచుపల్లిల్లో వివాదాస్పద 99 ఎకరాలు భూమిని రెడ్ ఫోర్ట్ కంపెనీకి కేటాయించింది. కానీ ఆ తర్వాత ఆ భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని కోర్టు తీర్పు ఇవ్వడంతో.. రెడ్‌ఫోర్ట్ కంపెనీ చెల్లించిన రూ. 200 కోట్లకు గాను రూ. 850 కోట్ల విలువ చేసే భూమిని అప్పగించాల్సి వచ్చింది. స్వయంగా చేదు అనుభవం ఉన్నా.. దాన్ని లెక్కలోకి తీసుకోకుండానే లిటిగేషన్ ఉన్న భూములపై అత్యుత్సాహంలో వేలానికి వెళ్లింది ప్రభుత్వం. కోర్టు మొట్టికాయలతో వెనక్కి తగ్గి.. సెప్టెంబర్ 27,28 తేదిల్లో జరగాల్సిన వేలాన్ని రద్దు చేసుకుంది. హైకోర్టు తాజాగా స్టే విధించిన ఈ భూములు వివాదంలో ఉన్నాయని, వేలం వేయడానికి కుదరదని తొలివెలుగు గతంలోనే కథనాలు రాసింది. కానీ అంత చిన్న విషయాన్ని పట్టించుకోకుండా వేలానికి వెళ్లి ఎదురు దెబ్బ తగిలించుకుంది కేసీఆర్ ప్రభుత్వం.
117 ఎకరాలకు నోటిఫికేషన్
ఈనెల ఒకటో తేదిన .. పుప్పాలగూడలో 94 ఎకరాలను 26 ప్లాట్స్‌గా, ఖానామెట్‌లో 23 ఎకరాలను 9 ప్లాట్స్‌గా విభజించింది. 27న ఖానామెట్, 28న పుప్పాలగూడలో ఈ వేలానికి బిడ్డింగ్ పిలిచింది. వాస్తవానికి ఇక్కడ భూమి తమ అధీనంలో లేకుండానే.. ఉన్న రైతులను తరిమేసి ఇష్టానుసారంగా వ్యవహరించింది ప్రభుత్వం . ఖానామెట్‌లోని అసైన్డ్ ల్యాండ్ 75 ఏళ్లుగా దున్నుకుంటున్న వారికి నష్టపరిహారం ఇవ్వకుండానే.. ఆ పొలాన్ని దున్నేసి ప్లాట్స్ చేసింది. ఇటీవల ఇక్కడ పరిస్థితిని తెలుసుకునేందుకు తొలివెలుగు వెళ్లగా.. లైవ్ లోనే బాధితులు పెట్రోల్ పోసుకుని అత్మహత్యాయత్నం చేసుకున్నారు. 41జ12 సర్వే నెంబర్ లో తమకున్న 5 ఎకరాలను సర్కార్ లాక్కుంటోందని, ముస్లిం కుటుంబాలు కోర్టుకు వెళ్లాయి. చివరికి సర్కార్‌కు చుక్కెదురు తప్పలేదు.
కాందిశీకుల భూముల్లో కబ్జాల పర్వం
కాందిశీకుల భూముల్లో ఏళ్ల తరబడి వ్యవసాయం చేసుకున్న రైతులు ఉన్నారు. వారంతా హైకోర్టు, సుప్రీం కోర్టులకు వెళ్లగా.. ఆయా కేసులపై ఇప్పటికీ విచారణ కొనసాగుతొంది. సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినా.. ఇంకా కింది కోర్టులో మరికొంత భూమిపై విచారణ జరుగుతోంది. కానీ ఇదే కాందిశీకుల భూమిలో వందల ఎకరాల్లో కార్పోరేట్ కంపెనీలు యదేచ్ఛగా.. అక్రమంగా ప్రభుత్వ అండదండలతో నిర్మాణాలు చేపడుతున్నాయి. అలాంటిది వారి టైటిల్‌పై ప్రభుత్వం పోరాడకుండా.. తమ భూములను లాక్కుంటోందన్నది రైతుల అందోళన. కూల్చివేతలు జరిగిన.. ఏడు సర్వే నెంబర్లలో 108 ఎకరాల భూమి ఉంది. 1950 రికార్డుల నుంచి రైతులు ఆ భూమిని సాగు చేసుకున్నారు. శిస్తు చెల్లించారు. పహాణీల్లో వాళ్ల పేర్లు నమోదయ్యాయి కూడా. కాందిశీకుల భూముల్లో ఎక్కువ కాలం ఎవరు పంటలు పండించుకుంటారో వారికే ఇవ్వాలని గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఈక్రమంలో మాల్ పాణి అనే వ్యక్తి దొంగపత్రాలు సృష్టించి.. ఈ భూములను అమ్మకానికి పెట్టారు. సీసీఎస్ పోలీసులు కేసులు నమోదు చేయగా.. ఈ వ్యవహారంలో అరెస్టులు కూడా జరిగాయి. అయితే ఆ కేసులోనే ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో క్లియరెన్స్ వచ్చింది. కానీ రైతులు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న నేపథ్యంలో కొంత వరకు భూములు వారి చేతిలోనే ఉన్నాయి. వీటిపై కూడా కేసులు వేసి తమకే చెందాలని హైకోర్టు మెట్లు ఎక్కారు. మాల్ పాణి కేసులో ఇంప్లీడ్ అయిన రైతులను హైకోర్టులో తేల్చుకోవాలని సుప్రీం కోర్టు సూచనలు చేసింది. అటు హైకోర్టు కూడా అన్ని కేసులను జత చేసి ఒకేసారి వినేందుకు సిద్ధమైంది. మరోవైపు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న భూములపై తెలంగాణ సర్కార్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేయడం మొదటికే మోసం వచ్చింది. నోటిఫికేషన్ నే రద్దు చేసుకుంది. టీఆర్ఎస్ సర్కార్ నచ్చిన వారికి అక్రమంగా HMDA పర్మిషన్ లు ఇచ్చింది. దీని వెనుక ఎవరెవరికి.. ఎన్ని వందల కోట్ల లబ్ధి చేకూరిందో ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపిస్తే.. తేలిపోతుంది.
కోకాపేట భూములు కూడా ప్రైవేట్‌వేనా..?
నుస్రత్ ఘంగ్ -1 కోకాపేటలోని సుమారు 1500 ఎకరాల భూములను 1835 లో కొనుగోలు చేశారు. తనకు పిల్లలు లేకపోవడంతో.. అన్నాదమ్ముల పిల్లలకు పంచి ఇచ్చారు. 1956లో ముంతకాపు జరిగింది. సీసీఎల్ ఇంప్లిమెంట్ చేయాలని అర్డర్ ఇచ్చింది. 1973లో పార్టిషన్ జరిగింది. దీనిపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే వేలం వేసిన భూములే కాకుండా మరిన్ని భూములను కొట్టేసేందుకు పావులు కదులుతున్నాయి. ఒక్క ఎకరం రూ. 60 కోట్లు పలికేసరికి అందరికి కోకాపేట మిగులు భూములపైనే కన్నుపడింది.కబ్జాలు కావొద్దనే అమ్ముకుంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. మిగతా భూములని ఎవరికి ఫేవర్ చేస్తారోనన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే ఇటీవల కోకాపేట భూముల వ్యవహారంపై విచారణ జరగాలని చాల మంది కోరడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. హైదరాబాద్ భూముల లిటిగేషన్ తెలిసిన వారు ఏది ప్రభుత్వ భూమి.. ఏది ప్రైవేట్ ల్యాండ్ అని ఇట్టే చెప్పుతారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రభుత్వం తన భూమి తాను కాపాడుకోలేక.. ప్రయివేట్ వ్యక్తులకు సహకరిస్తోంది. ప్రైవేట్ భూమి అని తెలిసినా.. పేదవాడు ఉంటే లాక్కొని మరి.. ప్రభుత్వ భూమి అని బోర్డులు పాతేస్తున్నారు. కోకాపేట భూముల వ్యవహారంలోనూ కొన్ని అసక్తికర అంశాలను తొలివెలుగు వెలుగులోకి తెచ్చి మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది.