ఇది ఇల్లీగల్ చట్టం
1861 నాటి చట్టం.. ఇప్పుడు వర్తించదు
నేను 5 కోట్ల మంది ఇళ్లకు వెళ్లి ప్రచారం చేయాలా ?
నా నియోజకవర్గానికి నన్ను వెళ్లనివ్వరా ?
కుప్పం నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా
కుప్పం పర్యటనకు వెళ్తున్న తనను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. నాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వరు ? కమాన్ ! ఆన్సర్ ! అంటూ రెచ్చిపోయారు. బుధవారం సాయంత్రం పెద్దూరు వద్ద బాబు పర్యటనలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆయనను, పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఎన్నడూ లేనంతగా ఆయన వారిపై నిప్పులు కక్కారు.నాకే రూల్స్ చెబుతారా అన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహించకూడదన్న నోటీసులు ఉంటే లిఖిత పూర్వకంగా తీసుకురావాలని ఆయన డీఎస్పీని కోరారు. కొద్దిసేపటికి సంబంధిత నోటీసులను పరిశీలించిన ఆయన.. ఇది ఇల్లీగల్ జీవో అని, ఇప్పుడు వర్తించదని అన్నారు. వీటిపై సంతకం పెట్టాలని పోలీసులు కోరుతున్నారని, 14 ఏళ్ళు సీఎంగా, ఆ తరువాత ప్రతిపక్షనేతగా ఉన్న నేను వీటిపై సంతకం పెట్టాలా అని ప్రశ్నించారు
.
5 కోట్ల మంది ప్రజల తరఫున మిమ్మల్ని అడుగుతున్నా.. రాష్ట్ర ప్రజలకు బేడీలు వెయ్యండి.. నా ప్రజలతో మాట్లాడనివ్వకుండా చేస్తారా ? నా బాధ చెబుతున్నా.. నా ఆవేశం చెబుతున్నా.. నన్ను అప్రదిష్ట పాల్జేయాలనుకుంటున్నారా అన్నారు, ఏ చట్టం ప్రకారం జీవో ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. ఈ చీకటి జీవోకు చట్టబధ్దత లేదన్నారు. ఖబడ్ధార్ ! జాగ్రత్తగా ఉండండి.. 5 కోట్లమంది ప్రజలు తిరగబడితే జగన్ పారిపోవడం ఖాయం అన్నారు.
వైసీపీకి, టీడీపీకి వేర్వేరు రూల్స్ ఉంటాయా ? నిన్న సీఎం జగన్ నిర్వహించిన బహిరంగ సభలు, రోడ్ షోలకు ఇలాగే నిబంధనలు పెట్టారా అని చంద్రబాబు అన్నారు. జగన్ పని అయిపోయిందని, మళ్ళీ గెలవరని చెప్పిన ఆయన.. సైకో పాలన పోవాలి… సైకిల్ పాలన రావాలి అని మళ్ళీ నినదించారు. శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెట్టినా తాను పారిపోనని అన్నారు. కుప్పం వస్తానని నెల క్రితమే ప్రకటించానన్నారు.
చివరకు రోడ్ షో కు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో చంద్రబాబు పెద్దూరు నుంచి పాదయాత్రగా కుప్పం బయల్దేరారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచాలని టీడీపీ నిర్ణయించింది. అంతకు ముందు కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతిపురం మండలం గడ్డూరు క్రాస్ రోడ్డు వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. వారిని తోసుకుని టీడీపీ కార్యకర్తలు చొచ్ఛుకు వచ్చేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ లాఠీ ఛార్జిలో కొందరు మహిళలతో సహా పార్టీ కార్యకర్తలు కొంతమంది గాయపడ్డారు. టీడీపీ ప్రచార రథాన్ని, సౌండ్ వాహనాన్ని పోలీసులు పోలీసు స్టేషన్ కు తరలించి డ్రైవర్లు, సిబ్బందిని అదుపు లోకి తీసుకున్నారు.కెనామాకుల పల్లి గ్రామంలో రచ్చబండ కోసం ఏర్పాటు చేసిన స్టేజీని కూడా పోలీసులు తొలగించారు.