కరోనాతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే ప్రైవేటు పాఠశాలలల్లో ఫీజుల మోత మోగిస్తున్నారు యాజమాన్యాలు. ఫీజులు కడితేనే ఎగ్సామ్స్ రాయనిస్తామనే ఆంక్షలు పెడుతున్నారు. దీంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. తాజాగా.. హైదరాబాద్ లోని నాంపల్లి షేంఖర్జి మెమోరియల్ హైస్కూల్ లో ఫీజు కట్టలేదని ఎగ్సామ్స్ రాయనీయకుండా విద్యార్దులను బయట నిలబెట్టారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు ఎక్సిబిషన్ మైదానంలో ఆందోళనకు దిగారు. ఫీజులు కడితేనే పరీక్షలు రాయనిస్తామని పిల్లల జీవితాలలో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అధికంగా ఫీజులు పెంచి తల్లిదండ్రుల నెత్తిన గుదిబండను మోపుతున్నారని ఆరోపించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అధిక ఫీజులు పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టినప్పటికీ.. పాటించకుండా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు.