నందమూరి తారకరత్నకు వెంటిలేటర్ సాయంతో అత్యున్నత వైద్యసేవలు అందిస్తున్నట్లు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు వెల్లడించారు. తారకరత్న ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని బులెటిన్ లో తెలిపారు.
నందమూరి తారకరత్నకు బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో నాలుగోరోజు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. తారకరత్నకు ఎన్ హెచ్ ఆసుపత్రిలో వైద్య సేవలు ప్రారంభించి 48 గంటలు పూర్తి కావడంతో నిన్న రాత్రి హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని..వెంటిలేటర్ సాయంతో అత్యున్నత వైద్యసేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తారకరత్నకు ఇంత వరకు ఎక్మో చికిత్స చేయలేదని ప్రకటనలో పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్యం గతం కంటే మెరుగ్గా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. గుండె,కాలేయంతో పాటూ ఇతర అవయవాలన్నీ మామూలు స్థితికి వచ్చాయని నందమూరి రామకృష్ణ తెలిపారు. మెదడుకు సంబంధించి ప్రత్యేక వైద్య నిపుణులు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
ఐసీయూలో న్యూరాలజిస్టుల పర్యవేక్షణ మధ్య తారకరత్న వైద్యం తీసుకుంటున్నారు. సోమవారం తారకరత్నకు సిటీ స్కాన్ చేశారు వైద్యులు. ఈ రిపోర్టులో ఏం వస్తుందనే దానిపైనా కుటుంబ సభ్యుల్లో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారాయణ హృదయాలయ ఆస్పత్రిలోనే ఉంటూ వైద్యులను అడిగి ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. గుండెపోటు వచ్చిన తర్వాత 30 నిమిషాల పాటు మెదడు పని తీరుపై ప్రభావం పడినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఇద్దరు న్యూరో సర్జన్లు సహా 10 మంది వైద్యులు తారకరత్న ఆరోగ్యాన్ని నిత్యం పర్యవేక్షిస్తున్నారు.