తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. రాష్ట్ర చరిత్రలోనే ఈ శుక్రవారం విద్యుత్ రికార్డు స్థాయికి చేరుకుంది. ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. సాయత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది ఇదే రోజున 11420 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా.. మే నెల వరకు 15000 మెగావాట్ల వరకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇంకా వేసవి మొదలుకాకముందే.. విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. వచ్చే రోజుల్లో ఈ డిమాండ్ శిఖరాగ్రానికి చేరుతోందని విద్యుత్ పంపిణీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్ల నమోదు కాగా.. తాజాగా ఈ రికార్డు బద్దలైంది.
యాసంగి పంటల సాగు విస్తీర్ణం విపరీతంగా పెరగడంతో వ్యవసాయ బోరుబావుల వినియోగం పెరుగుతోందన్నారు. కొద్దిరోజులుగా వ్యవసాయ బోర్లకు 10 గంటల్లో త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. శుక్రవారం 12 గంటల నుంచి సరఫరా పెరగడంతో డిమాండ్ కూడా పెరుగుతోందన్నారు.
శనివారం నుంచి వ్యవసాయ బోర్లకు 24 గంటల త్రీఫేజ్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గరిష్టంగా 15 వేల మెగావాట్లకు మించి డిమాండ్ ఉండవచ్చని విద్యుత్ పంపిణీ సంస్థలు చెబుతున్నాయి.