వేసవి కాలం ప్రారంభంలోనే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రోజురోజుకు పెరిగిపోతున్న ఎండ తీవ్రతతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావాలంటే భయ పడుతున్నారు. భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండ తీవ్రత దృష్ట్యా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పాఠశాల పనివేళలను కుదించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా కెరమెరి లో43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. కౌటాలలో 43.7 గా నమోదయ్యాయి.
ఆదిలాబాద్ జిల్లా చెప్రాలలో 43.8 డిగ్రీలు, జైనాథ్‌లో 43.8 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ లో 43.3 గా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెల్లవారుజామున 6 గంటలనుండే ఎండ తీవ్రత పెరుగుతోంది.
దీంతో స్కూల్ వేళల్లో మార్పు చేస్తూ.. ఉదయం 8గంటల నుంచి 11.30 గంటల వరకే విద్యాశాఖ అనుమతినిచ్చింది. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. ఎండ తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.