టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 నాటౌట్) మరో సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. శ్రీలంకతో మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య.. టీ20 ఫార్మాట్‌లో మూడో సెంచరీ నమోదు చేసాడు. తనకే సాధ్యమైన బ్యాటింగ్‌తో బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో సూర్య కొట్టిన ఓ సిక్స్.. ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. కిందపడుతూ.. పల్టీలు కొడుతూ సూర్య కొట్టిన ఈ సిక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇదెక్కడి షాట్ రా మామ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ షాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మదుషంక వేసిన 13వ ఓవర్ రెండో బంతిని సూర్య కిందపడుతూ సిక్సర్ బాదాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్ వేస్తాడని ముందే గ్రహించిన సూర్య.. స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో ముందుగా స్టంప్స్ వైపు జరిగాడు. సూర్య జరగడాన్ని గమించిన బౌలర్ తన ప్లాన్ మార్చి వైడ్ ఫుల్‌టాస్ వేసాడు. అయినా సూర్య బంతిని సూపర్ స్కూప్ షాట్‌తో షార్ట్ ఫైన్ దిశగా సిక్సర్ బాదాడు. షాట్ ఆడే క్రమంలో పూర్తిగా నేలపై పడిన సూర్య.. పల్టీలు కొట్టాడు. ఈ షాట్‌ను చూసిన లంక ఆటగాళ్లు, ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. సూర్యకు మాత్రమే ఈ షాట్స్ సాధ్యమనుకున్నారు.
ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సూర్య పలు రికార్డులను తన పేరిట లిఖించుకోవడంతో పాటు మరికొన్ని బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి నాన్ ఓపెనర్‌గా సూర్య చరిత్రకెక్కాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో సూర్య.. రెండో స్థానంలో నిలిచాడు.
నాలుగు సెంచరీలతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉండగా.. సూర్య మూడు సెంచరీలతో గ్లేన్ మ్యాక్స్‌వెల్, కొలిన్ మున్రోల సరసన నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ప్లేయర్‌గా సూర్య రికార్డు సృష్టించాడు.
ఇదే శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ బాది అగ్రస్థానంలో ఉండగా.. సూర్య 45 బంతుల్లో ఈ ఘనతను అందుకొని రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా 2023లో సూర్యకు తొలి సెంచరీ ఇదే. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచిన సూర్య.. కేఎల్ రాహుల్(2)ను అధిగమించాడు.
సూర్య విధ్వంసంతో శ్రీలంక బౌలర్లు పోటీపడి పరుగలిచ్చుకున్నారు. దాంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. సూర్యకు తోడుగా శుభ్‌మన్ గిల్(46), రాహుల్ త్రిపాఠి(35), అక్షర్ పటేల్(21 నాటౌట్) రాణించారు. లంక బౌలర్లలో మదుషంక రెండు వికెట్లు తీయగా.. కసన్ రజిత, కరుణరత్నే, హసరంగా తలో వికెట్ పడగొట్టారు.
3rd T20I hundred for Suryakumar Yadav from just 43 innings💥
What an inning by #SuryakumarYadav 100 in just 45 balls. pic.twitter.com/92LMpshGLv
— Prashant Umrao (@ippatel) January 7, 2023