కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ అలీఘఢ్ లోని ఓ విద్యా సంస్థ హిజాబ్ ధరించిన విద్యార్థుల ప్రవేశాన్ని నిషేధించడంతో కలకలం చెలరేగింది. కళాశాల కు నిర్ధేశించిన యూనిఫాం కాకుండా.. హిజాబ్ ధరించి ఉన్న ముస్లిం బాలికలకు ప్రవేశాన్ని నిరాకరించింది యాజమాన్యం. క్లాస్ కు హాజరవుతున్నప్పుడు ముఖాన్ని కప్పుకోవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.
అంతేకాకుండా హిజాబ్ ధరించిన విద్యార్ధులు కళాశాల లోపలికి కూడా రానివ్వకుండా గేట్ దగ్గరే అడ్డుకోవడంతో.. విద్యార్ధులు అక్కడే భైటాయించారు. కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ముస్లీం సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు.. హిజాబ్ ధరించిన విద్యార్ధులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. క్యాంపస్ లోకి ప్రవేశిస్తుండగానే తమను అడ్డగించారని.. హిజాబ్ తొలగించి లోనికి రావాలని ఇబ్బందలకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేసింది. హిజాబ్ తో వారికేం సమస్య వస్తుందో అర్ధం కావట్లేదని మండిపడింది.
కాలేజీ ప్రాస్పెక్టస్ లో డ్రెస్ కోడ్ స్పష్టంగా పేర్కొన్నామని కళాశాల ప్రొక్టర్ అనిల్ వర్ష్నేని వెల్లడించారు. విద్యార్థులు కళాశాల నియమాలు, నిబంధనలను మాత్రమే పాటించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. డ్రెస్ కోడ్ లను సీరియస్ గా అమలు చేయాలని యాజమాన్యం చెప్పిన విధంగానే నడుచుకుంటామని ఆయన తెలిపారు.