కర్నాటకలో రగిలిన హిజాబ్ సమస్య ఒక్క భారత్ లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. హిజాబ్ ధరిస్తే పాఠశాలలు, కళాశాలలకు రావద్దని కర్నాటకలో విద్యార్థులపై ఆంక్షలు విధించారు. కర్నాటకలో మొదలైన ఈ సమస్య అంతటితో ఆగకుండా అన్ని రాష్ట్రాలకు పాకుతోంది.
అయితే.. ఇప్పుడీ హిజాబ్ అంశం ఏపీకి చేరింది. అలాంటి ఘటనే తాజాగా రాష్ట్రంలో చోటు చేసుకుంది. విజయవాడకు చెందని ఓ కాలేజీ యాజమాన్యం.. బుర్కా వేసుకొచ్చిన కొంత మంది ముస్లిం విద్యార్థినులను కాలేజీలోకి అనుమతించలేదు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
తాము ఫస్ట్ ఇయర్ నుంచి బుర్కాలోనే కళాశాలకు వస్తున్నామంటున్నారు విద్యార్ధులు. ఎక్కడో ఏదో జరిగిందని తమను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని మండిపడుతున్నారు. చదువులో కూడా కులాలు మతాలు అనే భేదాలను చూపించడం ఏందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుర్కా వేసుకున్న వారి అడ్మిషన్ ను కాలేజీలో ఎలా తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు.
కాలేజీ ఐడీ కార్డులో సైతం తాము బుర్కాతోనే ఫోటో దిగామని వాపోతున్నారు. దీంతో కాలేజీ వద్దకు ముస్లిం పెద్దలు చేరుకున్నారు. ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారంటూ గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.