కర్ణాటకలో తలెత్తిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హిందువులు, ముస్లీం లు అంటూ మత కల్లోలాలు రేకెత్తించేలా ఒక్కరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏదో ఒకనాడు హిజాబ్ ధరించిన మహిళే ప్రధాని అవుతుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై యోగి స్పందించారు. దేశంలో రాజ్యాంగం ప్రకారమే వ్యవస్థ నడుచుకుంటుందే తప్ప.. ఇస్లామిక్ చట్టం ప్రకారం నడుచుకోదన్నారు.
ముస్లిం మహిళలకు ఊరట కలిగించేలా ప్రధాని ట్రిపుల్ తలాక్ నిబంధనను తొలగించారని యోగి వెల్లడించారు. వారికి దక్కాల్సిన హక్కులను, గౌరవాన్ని కల్పించేందుకు మోడీ ఆ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. వ్యక్తిగత మతాచారాలను, మతపరమైన నిర్ణయాలను దేశంపైనా, దేశ వ్యవస్థలపై రుద్దడం సరికాదని యోగి అభిప్రాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్ లో ఉన్న ఉద్యోగులందరినీ కాషాయం ధరించమని నేను ఆదేశించగలనా..? అని ప్రశ్నించారు. అలాంటి డ్రెస్ కోడ్ నే పాటించాలని స్కూళ్లకు ఉత్తర్వులు ఇవ్వగలనా. ? అని నిలదీశారు.
దేశం ఓ రాజ్యాంగం ప్రకారం నడిస్తే.. అందుకు అనుగుణంగానే మహిళలు ఆత్మాభిమానం, భద్రత, స్వాతంత్ర్యం పొందుతారని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.