హిమాచల్ ప్రదేశ్ లో సోమవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కులు జిల్లాలో ప్రయాణికులతో వెళుతున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకు పోయింది.
ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరణించిన వారిలో కొందరు విద్యార్థులు కూడా ఉన్నారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.
బస్సు షాన్ షేర్ నుంచి సాయింజ్ కు వెళుతుండగా జంగ్లా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు కులూ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అశుతోష్ గార్గ్ తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది వరకు విద్యార్థులు ఉన్నట్టు ఆయన చెప్పారు. జిల్లా అధికారులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయని ఆయన వివరించారు.
ఘటనపై ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్సకు ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు.