హిమాచల్ ప్రదేశ్‌లో మంత్రి వర్గ విస్తరణ జరిగింది. కేబినెట్ విస్తరణలో నూతనంగా ఏడుగురికి అవకాశం కల్పించారు. నూతనంగా మంతి పదవులు పొందిన వారిలో ధనీ రాం శాండిల్, చందర్ కుమార్, హర్షవర్దన్ చౌహన్, జగత్ సింగ్ నేగీ, రోహిత్ ఠాకూర్, అనిరుధ్ సింగ్, విక్రమాదిత్య సింగ్‌లు ఉన్నారు.
రాజ్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నూతన మంత్రులతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం సుఖ్ విందర్ సింగ్ సుక్కు, డిప్యూటీ సీఎం ముఖేశ్ అగ్నిహోత్రీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
గతేడాది నవంబర్ 12న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పార్టీ విజయంలో మాజీ సీఎం వీరభద్రసింగ్ సతీమణి, పీసీసీ అధ్యక్షురాలు రాణి ప్రతిభా సింగ్ కీలకపాత్ర పోషించారు. దీంతో ఆమెను ముఖ్యమంత్రిగా నియమిస్తారని అంతా అనుకున్నారు. కానీ సుఖ్విందర్ సింగ్ కు అధిష్టానం ఆ అవకాశం ఇచ్చింది.
డిసెంబర్ 11న సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆయన కేబినెట్ విస్తరణ చేపట్టలేదు. కేబినెట్‌ను విస్తరించనున్నట్టు ఇటీవల ఆయన ప్రకటించారు. ఈ మేరకు అధిష్టానానికి ఓ లిస్టును పంపినట్టు, దానికి ఆమోదం రాగానే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. తాజాగా ఈ జాబితాలో దివంగత మాజీ సీఎం వీరభద్రసింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ కు మంత్రిగా అవకాశం కల్పించారు.