హిమాచల్ ప్రదేశ్‌లో ఓటర్లు మరోసారి సాంప్రదాయాన్ని పాటించారు. ఇక్కడ ఓటర్లు ప్రతి ఐదేండ్లకోసారి అధికారాన్ని మారుస్తుంటారు. ఈ సాంప్రదాయం ప్రకారం అధికార బీజేపీకి ఓటర్లు షాక్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. రాష్ట్రంలో 68 అసెంబ్లీ స్థానాలకు గాను సగానికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం నుంచీ ఉత్కంఠను పెంచాయి. ఇరు పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య హోరా హోరి పోరు ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ ముందే వెల్లడించాయి. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీది కాస్త పైచేయి ఉంటుందని అంచనా వేశాయి.
కానీ ఫలితాల్లో అంచనాలు తారుమారయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్‌కు ఆధిక్యం లభించింది. ఇక ఈ ఎన్నికల్లో ఆప్ ఎలాంటి ప్రభావమూ చూపించలేకపోయింది. కేవలం ఒక్క శాతం ఓట్లతో ఆప్ సరిపెట్టుకుంది. సీఎం జైరాం ఠాకూర్ సొంత నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి ఘన విజయం సాధించారు.
రాష్ట్రంలో గత మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్, బీజేపీలు వరుసగా ఒక దాని తర్వాత మరో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ ఏ పార్టీ వరుసగా రెండో సారి అధికారంలోకి రాకపోవడం గమనార్హం. ఈ సారి ఈ సాంప్రదాయాన్ని మార్చాలని బీజేపీ నేతలు ప్రయత్నించారు.
ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ ఈ సారి ‘సంప్రదాయాన్ని మారుద్దాం.. ప్రభుత్వాన్ని కాదు’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ లాంటి కీలక నాయకుల ఈ రాష్ట్రానికి చెందిన వారు కావడంతో ఎన్నికలను మరింత ప్రతిష్ఠాత్మకంగా బీజేపీ తీసుకుంది. కానీ ఓటర్లు మాత్రం మరోసారి సాంప్రదాయాన్ని పాటించారు.
బీజేపీ ఓటమిలో పలు అంశాలు తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఉద్యోగుల పింఛన్, యాపిల్ వ్యాపారుల సమస్యల్లాంటి సామాజిక అంశాలు బీజేపీ కొంప ముంచాయి. ఇక అంతర్గత సమస్యలు, నాయకుల మధ్య సమన్వయ లేమి, తిరుగుబాట్లు కూడా బీజేపీ ఓటమికి కారణమయ్యాయి. తిరుగుబాటు నేతలను బుజ్జగించడంలో నడ్డా విఫలమయ్యారు. దీంతో ప్రధాని మోడీ రంగంలోకి దిగారు. ప్రధాని మోడీని బ్రహ్మస్త్రంగా ప్రయోగించినప్పటికీ ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించలేకపోయింది.
ఇక కాంగ్రెస్ ను కూడా పార్టీలో లుకలుకలు కలవర పెట్టాయి. అయితే అధికారం మారే సంప్రదాయానికి తోడు ప్రభుత్వ వ్యతిరేక ఓటుపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ధరల భారం, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రచారం చేస్తూ ఓట్లను రాబట్టుకుంది. ఎన్నికల్లో స్థానిక కాంగ్రెస్ నేతలే ఒంటరి పోరాటం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ మరణానంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ను నాయకత్వ లేమి బాధించింది. పార్టీలో ఎక్కువ మంది ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఈ అంశాన్ని తీసుకుని కాంగ్రెస్ విమర్శలు గుప్పించారు. కానీ కాంగ్రెస్ నేతలు జాగ్రత్తపడ్డారు. ఎన్నికలు ముగిసే వరకు సీఎం పదవిపై ఆశలు, ఆకాంక్షలను ప్రదర్శించి విభేదాలతో రోడ్డున పడకుండా చూసుకున్నారు.