హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను నంబరు 12 న నిర్వహిస్తున్నట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. డిసెంబరు 8 న ఓట్ల లెక్కింపు జరుగుతుందని అదే రోజున ఫలితాలను ప్రకటించనున్నట్టు పేర్కొంది. అయితే ఆశ్చర్యంగా గుజరాత్ ఎన్నికల తేదీలను వెల్లడించలేదు. ఈ రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఈ సంవత్సరాంతంలో ఎన్నికలు జరగాల్సి ఉంది. 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కాల పరిమితి జనవరి 8 తో ముగియనుంది.
26 రోజుల తరువాత .. అంటే ఫిబ్రవరి 18 తో గుజరాత్ శాసన సభ కాలపరిమితి ముగుస్తుంది. హిమాచల్ ఎన్నికలపై శుక్రవారం ఈసీ ప్రకటన చేస్తూ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీలకు ముగియనున్న కాల పరిమితులు, వాతావరణం, తేదీల మధ్య విరామం వంటి పలు అంశాలను తాము పరిశీలించామని వెల్లడించింది.
సాధారణంగా ఇలా జరగడం అరుదని అంటున్నారు. మొదట గుజరాత్.. హిమాచల్ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటిస్తుందని ఉదయం వార్తలు వచ్చాయి. కానీ గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ ని పక్కన బెట్టి హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీనే ఈసీ ప్రకటించింది.
హిమాచల్ ఎన్నికలు ఒకే దశలో జరుగుతాయని చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నామినేషన్లదాఖలుకు చివరి తేదీ అక్టోబరు 24 అని, 27 న నామినేషన్ల స్క్రూటినీ అని, ఉపసంహరణకు చివరితేదీ 29 అని ఆయన వివరించారు. ఈ నెల 17 న నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు.