భారత దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రజలు సంప్రదాయ వంటకాలను తింటుంటారు. తమకు స్థానికంగా లభించే పదార్థాలతో సంప్రదాయ వంటలు చేసి తింటారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లోనూ అలాంటి వంటకాలు ఉన్నాయి. వాటిల్లో చంబా చుఖ్ పచ్చడి కూడా ఒకటి. దీనికి ప్రస్తుతం ఆ రాష్ట్రం జీఐ (జియోగ్రాఫికల్ ఇండెక్స్) ట్యాగ్ స్టేటస్‌ను కోరుతోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పండే చిత్రాలి అనే రకం మిరపకాయలతో సదరు చట్నీని చేస్తారు. ఎరుపు లేదా ఆకుపచ్చ మిరపకాయలను ఎండబెట్టి వాటిని పొడి చేసి ఆ కారంతో లోకల్ సిట్రస్ పండ్ల నుంచి రసాన్ని తీసి, వాటికి మసాలా దినుసులు కలిపి ఆ చట్నీని తయారు చేస్తారు. దాన్ని మీల్స్ లేదా స్నాక్స్‌తో తినవచ్చు. లేదా కూరల్లోనూ వాడవచ్చు. సాస్, పికిల్ లేదా ఫుడ్ రూపంలో దాన్ని తీసుకుంటారు.
హిమాచల్ ప్రదేశ్లో చంబా చుఖ్ చట్నీని అనేక రకాలుగా తయారు చేస్తారు. అందులో కొందరు వెల్లుల్లి వేస్తారు. కొందరు తేనె వేస్తారు. కొందరు డ్రై ఫ్రూట్స్‌తోనూ ఆ చట్నీని తయారు చేస్తారు. అయితే ఎలా చేసినా ఆ చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇక అక్కడ ఆ చట్నీని తయారు చేసి బాటిల్స్‌లో కూడా అమ్ముతారు.
చంబా చుఖ్ చట్నీని ఎవరైనా తయారు చేసుకోవచ్చు. కాశ్మీరీ ఎండు మిర్చితో ఆ చట్నీని చేయవచ్చు. అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటంటే…
* 6 నుంచి 7 కాశ్మీరీ ఎండు మిర్చి (గోరు వెచ్చని నీటిలో 1 గంట పాటు నానబెట్టాలి)
* 10 నుంచి 15 తాజా ఎర్ర మిరపకాయలు
* 4 – 5 వెల్లుల్లి రెబ్బలు
* ఒకటిన్నర టీస్పూన్ – ఉప్పు
* 1/4 వంతు కప్పు – ఆవ నూనె
* అర టీస్పూన్ – పసుపు
* 1 టీస్పూన్ – కాశ్మీరీ కారం (అవసరం అనుకుంటేనే)
* 1/4 టీస్పూన్ – ఇంగువ
* 1టీస్పూన్ – చింతపండు పేస్ట్
* 2 టేబుల్ స్పూన్లు – చక్కెర
* 1 టీస్పూన్ – ధనియాలు
* 1 టీస్పూన్ – జీలకర్ర
* 1 టీస్పూన్ – సోంపు
* 1 టీస్పూన్ – వాము
* 1 టీస్పూన్ – ఆవాలు
తయారు చేసే విధానం…
* నానబెట్టుకున్న ఎర్ర మిరపకాయలు, తాజా మిరపకాయలు, అల్లం, వెల్లుల్లిలకు కొంత నీరు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి.
* ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడెక్కాక ఇంగువ వేసి ఫ్రై చేయాలి. మసాలా దినుసులను పొడి చేసుకోవాలి.
* ముందుగా చేసుకున్న పేస్ట్, ఉప్పు, పసుపు, చింతపండు పేస్ట్, కారం, నీళ్లను కలపాలి.
* మీడియం మంటపై వేడి చేయాలి. అనంతరం చక్కెర కలపాలి. మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి.
* స్టవ్ ఆర్పి చల్లార్చాలి. చల్లారాక ఎయిర్‌టైట్ కంటెయినర్‌లో నిల్వ చేసుకోవాలి.
అయితే చంబా చుఖ్ మాత్రమే కాక ఆ రాష్ట్రంలోని కర్సోగ్ కుల్త్ (ఉలవలు), తంగి ఆఫ్ పంగి (హేజల్‌నట్స్‌లో ఒకరకం), చంబా మెటల్ క్రాఫ్ట్స్ (ఇత్తడి విగ్రహాలు, పాత్రలు), రాజ్మా ఆఫ్ భర్మర్ (కిడ్నీ బీన్స్‌లో ఒక రకం) తదితర పదార్థాలు, వస్తువులకు కూడా వారు జీఐ స్టేటస్ కోసం యత్నిస్తున్నారు.