హిమాచల్‌ప్రదేశ్ లోని మంచు మంట పెడుతోంది. భారీగా కురుస్తున్న మంచుకారణంగా మూడు జాతీయ రహదారులతో పాటు 275 రహదారులు మూసుకుపోయాయి. ప్రజా జీవనం కష్టంగా మారింది. లాహౌల్-స్పితి జిల్లాలో గరిష్టంగా 177 రోడ్లపై మంచుపేరుకుపోవడంతో మూతపడ్డాయి. చంబా జిల్లాలో 5, కిన్నౌర్‌లో 9, కాంగ్రాలో 2, కులులో 3, మండిలో 13, సిమ్లాలో 64 రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఎదురవుతున్నాయి.
దాదాపు 330 ట్రాన్స్‌ఫార్మర్లు పని చేయకపోవడంతో నీటి సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతున్నది. రోహ్‌తంగ్ పాస్‌తో పాటు కులులోని పర్యాటక ప్రదేశాల్లో భారీగా మంచు కురుస్తోంది. లాహౌల్ లోయ హిమపాతం నిండిపోయింది.
సిమ్లా జిల్లాలోని జఖూ, కుఫ్రితో సహా ఎత్తైన ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండామంచు కురుస్తున్నది. అధికారులు రోడ్లపై ఉన్న మంచును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. డీసీ ఆదిత్య నేగి స్వయంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
రోడ్లపై ఉన్న మంచును తొలగించే వరకు ప్రయాణాలు చేయొద్దని వాహనదారులకు పోలీసులు సూచించారు. మరో వైపు అటల్ టన్నెల్ సౌత్ పోర్టల్ వద్ద దాదాపు 30 సెంటీమీటర్లు, కోక్సర్‌లో 20, రోహ్‌తంగ్ పాస్‌లో 40 సెంటీమీటర్లు, కుంజమ్‌లో 54 సెంటీమీటర్లు, బరాలాచాలో 45 సెంటీమీటర్లు, ఘెపాన్ పీక్‌లో 50 సెంటీమీటర్లు, జలోరీ పాస్, సొలంగనాలలో 20 సెంటీమీటర్ల మేర హిమపాతం కురిసింది.
భారీ హిమపాతం నేపథ్యంలో 505 జాతీయ రహదారి గ్రాప్ నుంచి కాజా వరకు మంటు కురుస్తుండడంతో రోడ్డును మూసివేశారు. మంచు కురిసే సమయంలో స్థానికులతో పాటు పర్యాటకులు సైతం అవనసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.
చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్‌కు చేరాయి. కీలాంగ్‌లో -4.6, కుకుమ్సేరి -2.5, నరకంద -2.5, కల్ప – 1.8, కుఫ్రీ – 1.3చ, మనాలి 0.4లో, డల్హౌసీ – 0.3, సిమ్లా 2.9గా డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని అధికారులు తెలిపారు.