కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ.. రాజీవ్ గాంధీ కుమారుడే అని చెప్పడానికి బీజేపీ ఎప్పుడైనా రుజువులు అడిగిందా? అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఇంత దిగజారి మాట్లాడతారా? అని మండిపడ్డారు.
ఓ అగ్ర నేత వ్యక్తిగత జీవితాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన హిమంతను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్. రాహుల్ నానమ్మ ఇందిర, తండ్రి రాజీవ్ దేశం కోసం ప్రాణాలను త్యాగం చేశారని అన్నారు. రాహుల్ తాత నెహ్రూ ప్రధానిగా పని చేశారని గుర్తుచేశారు.
అలాంటి కుటుంబం గురించి ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని అన్నారు. ఇదేనా బీజేపీ మాట్లాడే ధర్మం, హిందుత్వం అని ప్రశ్నించారు. తప్పును అంగీకరించి హిమంత బహిరంగ క్షమాపణ చెప్పలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.
కేసీఆర్ వ్యాఖ్యలకు హిమంతి బిస్వా కౌంటర్ ఇచ్చారు. సర్జికల్ స్ట్రయిక్స్ పై రాహుల్ ఆధారాలు అడిగారని, బిపిన్ రావత్ మరణంపై వ్యాఖ్యలు చేశారని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి తాము మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబంపై విమర్శలు చేయకూడదా? అని నిలదీశారు. కేసీఆర్ కు కేవలం తాను మాట్లాడిందే తప్పుగా అనిపించిందా..? అని ప్రశ్నించారు. దీనికి కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు బిస్వా.