– ఇంకా కోలుకోని అదానీ గ్రూప్
– హిండెన్ బర్గ్ దెబ్బతో షేర్లన్నీ ఢమాల్
– అంతకంతకూ సంపద ఆవిరి
– 120 బిలియన్ డాలర్ల నుంచి..
– 49.1 బిలియన్ డాలర్లకు పడిపోయిన అదానీ
ఎక్కడో అమెరికాలోని చిన్న షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్. అతి పెద్ద దేశమైన ఇండియాలోని బడా బిలియనీర్ గౌతమ్ అదానీని పెద్ద దెబ్బే కొట్టింది. ఆయన అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని కకావికలం చేసి పారేసింది. అదానీ.. ఒకప్పుడు ప్రపంచ కుబేరుల్లో ఒకరు. సుమారు నెల రోజుల క్రితం వరకూ తన 120 బిలియన్ డాలర్ల అపార సంపదతో ప్రపంచ ధనికుల్లో మూడో స్థానంలో ఉన్నారు.
ఇండియాలో ప్రతి కీలక రంగంలోనూ, ప్రాజెక్టులోనూ భారీ పెట్టుబడులు పెట్టి అన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటూ విదేశీ ఇన్వెస్టర్లను సైతం శాసించే స్థాయికి ఎదిగిన ఈ పారిశ్రామిక దిగ్గజం.. ఇప్పుడు కుదేలయ్యారు. హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ అంటేనే ఉలిక్కిపడిపోతున్నారు. స్టాక్ మార్కెట్ లో ఈయన సాగించిన అవకతవకలు, ఫ్రాడ్ ను ఆ చిన్న కంపెనీ అగ్గిరవ్వ లాంటి తన నివేదికలో బయటపెట్టడంతో అదానీ వ్యాపారమంతా రోజురోజుకీ నీరసించి కంపెనీల షేర్లన్నీ ఢమాల్ మంటూ వచ్చాయి.
సోమవారం నాటికి అదానీ సంపద విలువ జస్ట్ 50 బిలియన్ డాలర్లకన్నా తక్కువస్థాయికి పడిపోయిందని బ్లూమ్ బెర్గ్ ఇండెక్స్ తెలిపింది. కచ్చితంగా చెప్పాలంటే ఇప్పుడది 49.1 బిలియన్ డాలర్లని అంచనా వేసింది. ఇండియన్ స్టాక్ మార్కెట్ ని కుదిపివేసిన హిండెన్ బర్గ్ రిపోర్టు అదానీ గ్రూపు లిస్టెడ్ కంపెనీలకు పెద్ద షాకిచ్చింది. ఆయన నేతృత్వంలోని ఏడు కంపెనీలు బేర్ మంటున్నాయి.
ఇన్వెస్టర్లకు తాము 2024 సెప్టెంబరు గడువు కన్నా ముందే చెల్లింపులు చేస్తామని, అలాగే కొన్ని విదేశీ బ్యాంకులకు 500 మిలియన్ డాలర్ల రుణాలను ముందుగానే పే చేస్తామని ఆ మధ్య ప్రకటించినా ఆ హామీలు ఇన్వెస్టర్లలోని భయాందోళనలను తగ్గించలేకపోయాయి. అనుమానాల నీలినీడలు వారిని వెన్నాడుతూనే ఉన్నాయి. మొత్తంగా 83.6 బిలియన్ డాలర్లతో 11వ స్థానంలో ఉన్న ముకేశ్ అంబానీ సంపద కన్నా అదానీ ఆస్తులు ఇలా కరిగిపోవడం.. భారత స్టాక్ మార్కెట్ ని మరెన్ని ఒడిదుడుకులకు గురిచేస్తుందో చూడాలి.