అదానీ గ్రూప్ పై తాము చేసిన ఆరోపణలపై లీగల్ చర్య తీసుకునే యోచనలో ఉన్నామని ఆ సంస్థ చేసిన హెచ్చరికపై హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ స్పందించింది. తాము నేరుగా 88 ప్రశ్నలడిగామని, కానీ 36 గంటలు గడిచిపోయినా వీటిలో ఇప్పటివరకు ఒక్కదానికి కూడా సరైన సమాధానమివ్వలేదని ఈ కంపెనీ గురువారం ఓ స్టేట్మెంట్ లో విమర్శించింది.
పైగా, దానికి బదులు లీగల్ చర్య తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని, అలా అయితే తాము కూడా దాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొంది. ‘‘భారత, అమెరికా చట్టాల కింద కోర్టుకెక్కాలనే యోచనలో ఉన్నట్టు ప్రకటించారు.. దీనికి మేం వెల్కమ్ చెబుతున్నాం.. మా నివేదికకు పూర్తిగా కట్టుబడి ఉన్నాం.. కానీ మీరు తీసుకునే చర్య తేలిపోతుంది.. అందులో మెరిట్ ఉండదు’’ అని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సవాల్ చేసింది.
అదానీ సీరియస్ గా ఉన్నారంటే అమెరికాలో కూడా తమపై దావా వేయవచ్చునని, ఇందుకు తాము సహకరిస్తామని తెలిపింది. ఆరోపణలను నిరూపించే ఎన్నో డాక్యుమెంట్లు తమవద్ద ఉన్నట్టు పేర్కొంది.
720 సైటేషన్లు, 32 వేల పదాలతో కూడిన మా 106 పేజీల నివేదికను రెండేళ్ల పాటు కష్టించి తయారు చేశామని, తాము పేర్కొన్న అంశాలు భారత, అమెరికా చట్టాలకు లోబడే ఉన్నాయని ఈ సంస్థ వివరించింది. తమ మీద ఎలాంటి చర్య అయినా తీసుకోవచ్చు అని ఛాలెంజ్ విసిరింది హిండెన్ బర్గ్.
Our response to Adani: pic.twitter.com/6NcFKR8gEL
— Hindenburg Research (@HindenburgRes) January 26, 2023