ఇండియాలో బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఒక్క రిపోర్టుతో దాదాపు కూల్చివేసిన హిండెన్ బెర్గ్.. తాజాగా ట్విట్టర్ కో-ఫౌండర్, జాక్ డోర్సే నేతృత్వంలోని ‘బ్లాక్’ కంపెనీని టార్గెట్ చేసింది. అదానీ విషయంలో మాదిరే బాంబు లాంటి నివేదికను రిలీజ్ చేసింది. గురువారం ఈ రిపోర్ట్ బయటకు రాగానే ‘బ్లాక్’ సంస్థ షేర్ ధర 20 శాతం తగ్గింది. ఫలితంగా డోర్సే సంపద నిన్న ఒక్క రోజే 526 మిలియన్ డాలర్లు ..అంటే 11 శాతానికి క్షీణించింది. ఈ హఠాత్ పరిణామంత్తో జాక్ డోర్సే సంపద 4.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది.
ఇన్వెస్టర్లకు పేమెంట్స్ విషయంలో ఈ కంపెనీ ఫ్రాడ్ కు పాల్పడిందని, సంస్థ గణాంకాల్లో గోరంతలను కొండంతలు చేసి చూపారని, వాస్తవ ఖాతాదారుల కన్నా ఎక్కువగా సంఖ్యను చూపుతూ షేర్ విలువను కృత్రిమంగా పెంచారని హిండెన్ బెర్గ్ రిపోర్ట్ పేర్కొంది. దీంతో ఇన్వెస్టర్లు, ప్రభుత్వం కూడా మోసపోయినట్టు వెల్లడించింది. జాక్ డోర్సే కరోనా సమయాన్ని ‘బాగా’ వినియోగించుకున్నారు. దాదాపు 100 కోట్ల డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ సంస్థ ఖాతాల్లో 40 నుంచి 70 శాతం వరకు ఫేక్ అని ఈ సంస్థ మాజీ ఉద్యోగుల్లో కొందరు తెలిపారు అని ఈ నివేదిక వెల్లడించింది. కంపెనీ ఆదాయం గణాంకాల్లో కూడా అవకతవకలున్నట్టు గుర్తించామని పేర్కొంది.
బ్లాక్ వ్యాపార లక్ష్యం ‘ఆవిష్కరణ’ కాదు..దీని పేరిట ప్రభుత్వాన్ని, వినియోగదారులను సులువుగా మోసగించడం, కంపెనీపై నియంత్రణను నివారించడానికి, భారీ వడ్డీరేట్లకు రుణాలు, భారీ మొత్తం రుసుములను పెద్ద విప్లవాత్మక సాంకేతికగా చూపడం ఈ సంస్థ వెనకున్న అసలైన ఉద్దేశమని వివరించింది. అయితే ఈ ఆరోపణలన్నిటినీ జాక్ డోర్సే కంపెనీ ఖండిస్తూ హిండెన్ బెర్గ్ పై కోర్టుకెక్కుతామని హెచ్చరించింది. కానీ స్వయంగా డోర్సే దీనిపై స్పందించలేదు.
తాము రెండేళ్లు ఇన్వెస్టిగేట్ చేసి దిగ్భ్రాంతికరమైన ఈ విషయాలను కనుగొన్నామని ఈ షార్ట్ సెల్లర్ వెల్లడించింది. ‘బ్లాక్.. హౌ ఇన్ ఫ్లేటెడ్ యూజర్ మెట్రిక్స్ అండ్ ‘ప్రిక్షన్ లెస్’ ఫ్రాడ్ ఫెసిలిటేషన్ ఎనేబుల్డ్ ఇన్ సైడర్స్ టు క్యాష్ ఔట్ ఓవర్ 1 బిలియన్ డాలర్స్’ అని ఈ సంస్థ ట్వీట్ చేసింది. 2017 లో నాథన్ యాండర్సన్ అనే వ్యక్తి ఏర్పాటు చేసిన హిండెన్ బెర్గ్.. కార్పొరేట్ స్థాయిలో జరిగే కంపెనీల అక్రమాలు, అవకతవకలను బయటపెడుతూ వస్తోంది.