హిందీ జెర్సీ రెడీ అయింది. తెలుగులో ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అయింది. తెలుగులో డైరక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి, హిందీ వెర్షన్ ను కూడా డైరక్ట్ చేశాడు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ ఈ రోజు రిలీజైంది. షాట్ డివిజన్, సోల్, సన్నివేశాలు అన్నీ మనకు తెలిసినవే. కాకపోతే నటీనటులు మారారంతే. అయితే ఈ సెటప్ లో కూడా ఒక్కడు మారలేదు. అతడే బాలనటుడు రోనిత్.
తెలుగు జెర్సీలో నానికి కొడుకుగా నటించాడు రోనిత్. అతడి యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇప్పుడు హిందీ జెర్సీలో కూడా అతడు, అదే పాత్ర పోషించాడు. షాహిద్ కు కొడుకుగా నటించాడు. 2019లో జెర్సీ వస్తే, 2022లో హిందీ జెర్సీ వస్తోంది. ఈ మూడేళ్లలో రోనిత్ అస్సలు మారలేదు. అతడి లుక్స్ నుంచి హెయిర్ స్టయిల్ వరకు ఏదీ మారలేదు.
దిల్ రాజు, సితార ఎంటర్ టైన్ మెంట్స్, అల్లు ఎంటర్ టైన్స్ మెంట్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను హిందీలో నిర్మిస్తున్నాయి. తెలుగులో శ్రద్ధ శ్రీనాధ్ పోషించిన పాత్రను, హిందీలో మృణాల్ ఠాకూర్ పోషించింది. తెలుగు వెర్షన్ కు అనిరుధ్ సంగీతం అందించగా… హిందీ వెర్షన్ కు వచ్చేసరికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వరకు అనిరుధ్ ట్రాక్స్ నే వాడుకోవాలని నిర్ణయించారు. పాటల కోసం మాత్రం వేరే వాళ్లను తీసుకున్నారు.
షాహిద్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తన కెరీర్ ను ఈ సినిమా మలుపు తిప్పుకుందని అతడు భావిస్తున్నాడు. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది జెర్సీ.