బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అధికారిక కార్యాలయంలోని డెస్క్ పై ఎప్పుడూ ఓ గణేశ విగ్రహం ఉంటుంది. విఘ్నాలను తొలగించే గణేశుడంటే ఆయనకు సదా నమ్మకం.. భక్తి.. గౌరవం.. తెల్లోళ్ళ దేశంలో హిందూయిజానికి, భారతీయతకు స్వచ్ఛమైన నిలువుటద్దంలా ఉంటారాయన. ఏ దేశమేగినా..ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అనకపోతేనేం ? హిందుత్వ అంటే మాత్రం ఆయనకు మమకారమెక్కువ.. అపారమైన అభిమానం కూడా.. హిందూ మతం పట్ల తన విశ్వాసమే తన బలం అని గర్వంగా సునాక్ చెప్పుకొంటున్నారు. ‘ఇది కేవలం మతమే కాదు.. ఇదొక జీవన పరిణామ క్రమం కూడా.. హిందూ అన్నది సేవల విలువను చాటి చెబుతుంది.. డ్యూటీ నిబద్ధతకు ఇది నిదర్శనమే కాదు.. కుటుంబ బాంధవ్యాలను ముడి పెట్టే అద్భుత ‘సాధనం’ కూడా .. అని నిర్వచిస్తున్నారాయన.
ఒక మతం పట్ల విశ్వాసం అన్నది తనకు సంబంధించినంతవరకు ఈ జీవితాన్ని అర్థవంతం చేసి.. తోడ్పడేదే.. ఇందులో ఎలాంటి సందేహం లేదు అన్నది ఆయన దృఢమైన అభిప్రాయం. ‘మా ఇంట్లో చిన్న పూజామందిరం ఉంది..ప్రార్థన చేశాక నా పిల్లలను నిద్ర పుచ్చడానికి ముందు వారితో సరదాగా ఆడుకుంటాను. ఇంతకన్నాఎక్కువగా నేనుఏమీ చేయలేనని అనుకోకండి.. . హిందూయిజం విషయానికే వస్తే.. అది జీవితాన్ని ఇస్తుందని నమ్ముతాను.. అది సంస్కృతిని ప్రతిబింబిస్తుంది.. ఒక్కోసారి ఇంతకన్నా ఎక్కువే అని భావించినా ఆశ్చర్యం లేదు’ అని రిషి సునాక్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.
ఇందులో కొంత మతపరమైన విలువలు, మరి కొంత సాంస్కృతిక సంబంధ విలువలు ఉన్నాయని, ఒకేఒక చట్రంలో ఇది ఇమిడేది కాదని, పటిష్టమైన కుటుంబ బాంధవ్యాలు, విధి నిర్వహణలు, ప్రజాసేవలు వంటివి హిందూయిజంలో మిళితమై ఉన్నాయని ఆయన చెప్పారు. ఇదే సమయంలో ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంలో తమ నెం. 10 స్టాఫ్ చేసే మ్యూజిక్ కాన్సర్ట్ ల గురించి కూడా సునాక్ ప్రస్తావించారు. ఈ 12 రోజులూ ఈ సౌధం లోని వివిధ బృందాలు చేసే సంబరాలు సందడిగా ఉంటాయన్నారు.
నెం.10 క్రిస్మస్ రిసెప్షన్ల మ్యూజిక్ కార్యక్రమాల నిర్వహణా బాధ్యతను కూడా సునాక్ చేబట్టారు. అయితే మైఖేల్ బబుల్.. క్రిస్మస్ డీలక్స్ ఆల్బమ్ అంటే మాత్రం ఆయనకెంతో ఇష్టం. సాయంత్రాలు వీటిని పాడుతూ కూర్చుంటే అద్భుత అనుభూతిని ఇస్తాయంటారాయన. బ్రిటన్ కి తొలి ఆసియా ప్రధాని కావడమంటే ‘వండర్ ఫుల్ థింగ్’ అని వ్యాఖ్యానించారు. ఈ దేశానికి మంచి చేయడం ‘గుడ్ జాబ్’ కాక.. మరేమవుతుంది అని ప్రశ్నించారు. తన నార్త్ యార్క్ షైర్ నియోజకవర్గంలోని క్రికెట్ జట్టులో చేరాలనుకున్నా చేరలేకపోయానని కాస్త ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ అంటే ఈ ప్రధానికి ఎంతో మక్కువ అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది ?