అసోం ఎంపీ, ఆల్ ఇండియా డెమోక్రటిక్ యూనియన్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందువుల మనోభావాలను గౌరవిస్తూ ఈద్ ఉల్ అదా సందర్భంగా గోవులను బలి ఇవ్వడాన్ని మానుకోవాలని అసోం ముస్లింలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశాన్ని హిందూరాజ్ గా మార్చి హిందుస్థాన్ భావనను అంతం చేయాలని కొందరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. హిందూ రాజ్ గురించి వారు కలలు కంటున్నప్పటికి అది ఎప్పటికీ వాస్తవ రూపం దాల్చదన్నారు.
ఆర్ఎస్ఎస్ నేతలు ఎంత ప్రయత్నించినా దేశంలోని హిందూ ముస్లింల మధ్య ఐకమత్యాన్ని వారు బ్రేక్ చేయలేరని ఆయన పేర్కొన్నారు. ఈద్ ఒక్క రోజున ఆవు మాంసం తినకుంటే మనమేమీ చనిపోమన్నారు.
గోవులకు బదులు ఈసారి హిందూ సోదరులతో కలిసి ఈద్ పండుగను జరుపుకుందామని పిలుపునిచ్చారు. మన పూర్వీకులంతా హిందువులేనని ఆయన అన్నారు. అందువల్ల అన్ని మతాలను గౌరవించాలని ముస్లింలకు ఆయన పిలుపు నిచ్చారు.