శివసేన, బీజేపీలు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సమస్త హిందూ అఘాడి అధ్యక్షుడు మిలింద్ ఏక్టోబే సూచించారు. అలా కాకుండా బీజేపీ, శివసేన పార్టీలు వేరు వేరుగా ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. బీజేపీ-శివసేనకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామని తెలిపారు. హిందూ మహాసభ, హిందూ జాగృతి సమితి, హిందూ రాష్ట్ర సేనతో పాటు పలు హిందూ సంఘాలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ-శివసేన, ఎన్సీపీ-కాంగ్రెస్ పార్టీల సిద్ధాంతాలు వేరు వేరు అని… వేరు వేరు సిద్ధాంతాలు గల పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నిరసనలు తప్పవని చెప్పారు. వివాదాలు పక్కన పెట్టి బీజేపీ-శివసేన పార్టీలు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. మహారాష్ట్రలోని అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు నెల రోజులు కావొస్తున్నా అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది.