హిందూ, హిందుత్వ వాదంపై మరోసారి సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ రాజస్థాన్ జైపుర్ లో కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. దీనికి రాహుల్ తో పాటు.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ప్రస్తుత రాజకీయాల్లో హిందూ, హిందుత్వవాది అనే రెండింటి మధ్య పోటీ నడుస్తోందన్నారు రాహుల్.
ఈ దేశం హిందువులది… హిందుత్వవాదులది కాదన్నారు రాహుల్ గాంధీ. తాను హిందువునని.. హిందుత్వవాదిని కాదని చెప్పారు. అలాగే మహాత్మాగాంధీ హిందువు… గాడ్సే హిందుత్వవాది అంటూ వ్యాఖ్యానించారు. హిందుత్వవాదులకు అధికారమే ముఖ్యమన్నారు. 2014 నుంచి వారే అధికారంలో ఉన్నారని.. అలాంటి వారిని దింపేయాలని ప్రజలకు సూచించారు.
ఇదే కార్యక్రమంలో ప్రసంగించిన ప్రియాంక గాంధీ.. కేంద్రంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ 70 ఏళ్లలో ఏం చేసిందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. 70 ఏళ్ల సంగతి కాదు.. ఏడేళ్లలో మీరేం చేశారో చెప్పండని ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ నేతలు కులతత్వం, మతతత్వంపై మాట్లాడుతారు తప్ప ప్రజల సమస్యల గురించి ఆలోచన చేయరని మండిపడ్డారు ప్రియాంక.
చాలా రోజుల తర్వాత సోనియా, రాహుల్, ప్రియాంక ఒకే వేదికపై కనిపించడం… కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపినా పార్టీ అధ్యక్షురాలు ప్రసంగించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ నుంచి జైపూర్ వచ్చి సభలో పాల్గొన్న సోనియా ఎందుకు మాట్లాడలేదని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.