హిందుత్వ అంటే అది హత్యలు , హింసకు, చీలికకు ఆస్కారమిచ్చేదిగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులకు తాను వ్యతిరేకం కాదని, కానీ హిందుత్వకే వ్యతిరేకమని ఆయన అన్నారు. హిందూ మతానికి, హిందూత్వకు మధ్య చాలా తేడా ఉందని చెప్పిన ఆయన.. నేను హిందువునే అయినప్పటికీ మనువాద స్మృతికి వ్యతిరేకమని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బీఆర్. పాటిల్ బయో పిక్ పై రాసిన పుస్తకాన్ని కలబుర్గి లో ఆవిష్కరించిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన.. మరే మతంలోనైనా మర్డర్, హింస వంటివాటికి ఆస్కారం ఉందా అని ప్రశ్నించారు. కానీ హిందుత్వలోను , మనుస్మృతిలోను వీటికి తావుందన్నారు.
గతంలో కూడా సిద్దరామయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. నేను హిందువునే అయినా హిందుత్వను వ్యతిరేకిస్తున్నానని, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించకపోయినా దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడాన్ని ఏవగించుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని నిన్న ప్రకటించిన సిద్దరామయ్య.. రిటైరైన తరువాత కూడా తాను రాజకీయాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ ఏడాది మే నెల లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. మే 24 తో అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.