ఇటీవల కాలంలో యూత్ ఆలోచనా ధోరణి మారింది. లక్షలు సంపాదించే ఉద్యోగాలు సైతం వదిలేసి సొంతంగా వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఎలాంటి పెట్టుబడి లేకుండా సొంతంగా ఏదో ఒకటి చేసి లక్షల ఆదాయాన్ని మూటగట్టుకుంటున్నారు. అలాంటి వారిలో హిరేషా వర్మ ఒకరు.2013లో సంభవించిన కేదార్నాథ్ వరదలు ఆమెను ప్రభావితం చేశాయి. బాధితులకు సహాయం చేయడానికి ఢిల్లీలో ఆమె చేస్తున్న ఐటి వృత్తిని విడిచి పెట్టింది. జీవ రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రంలో గ్రాడ్యుయేషన్, బిజినెస్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన హిరేషా వర్మ ఆ విపత్తును చూసిన అనంతరం ఆమె తన నైపుణ్యాలను మంచి పనుల కోసం ఉపయోగించాలని అనుకుంది.
అనుకున్నదే తడవుగా ఉత్తరాఖండ్ వాతావరణం పై పరిశోధన చేసింది. అక్కడ పుట్ట గొడుగుల పెంపకానికి వాతావరణం అనుకూలంగా ఉంటుందని తెలుసుకుని ఆమె ప్రయోగాత్మకంగా రూ.2000 పెట్టి సక్సెస్ అయింది. ఆ తర్వాత ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మష్రూమ్ రీసెర్చ్ డైరెక్టర్ లో శిక్షణ పొంది అదే ఏడాది హంజన్ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించారు. 1.5 ఎకరాల భూమిలో పుట్టగొడుగుల పెంపకం అనే వెంచర్ ను ఏర్పాటు చేసి అక్కడ రెండు వేల మందికిపైగా జీవనోపాధి కలిగించింది. ఆమె చేస్తున్న మంచి పనిని గమనించి ఉత్తరాఖండ్ రాష్ట్ర అవార్డుతో ఆమెను సత్కరించింది.
రోజుకు 500 కిలోల దిగుబడి వస్తుండడంతో వివిధ ప్రాంతాల్లో పుట్టగొడుగులను అమ్మడానికి సొంతంగా రీటెయిల్ బ్రాండ్ అగ్రోకేర్ స్థాపించారు. ఇటీవల కాలంలో ఈ సంస్థ ఫుడ్ ప్రాసెసింగ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతానికి ఈ కంపెనీ దాదాపు 1.5 కోట్లు సంపాదిస్తోంది.