దేశంలో చరిత్రకారుల్లో అత్యధికులు మొఘల్స్ చరిత్ర రచించడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పాండ్యులు, చోళులు, మౌర్యులు, గుప్తులు వంటి పలు వంశాలకు చెందిన గొప్ప పాలకులు ఉన్నప్పటికి వారికి చరిత్ర కారులు ప్రాధన్యత ఇవ్వలేదని ఆయన తెలిపారు.
మహారాణ సహస్ర వర్ష్ కా ధర్మ యుద్ధ అనే పుస్తకాన్ని అమిత్ షా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. 1,000 సంవత్సరాలుగా సంస్కృతి, భాష, మతాల పరిరక్షణ కోసం మనం చేసిన పోరాటం వృథా కాలేదన్నారు. ‘ భారతదేశం ఇప్పుడు ప్రపంచం ముందు మళ్లీ గౌరవంగా నిలుస్తోంది. ఇప్పుడు దేశ కీర్తిని అందరూ గుర్తిస్తున్నారని తెలిపారు.
‘ నేను చరిత్రకారులకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకు అనేక సామ్రాజ్యాలు ఉన్నాయి, కానీ చరిత్రకారులు మొఘలులపై మాత్రమే దృష్టి కేంద్రీకరించారు. వారి గురించి ఎక్కువగా వ్రాశారు. పాండ్య సామ్రాజ్యం 800 సంవత్సరాలు పాలించింది. అహోం సామ్రాజ్యం అస్సాంను 650 సంవత్సరాలు ఏలింది’అని అన్నారు.
‘ వారు (అహోంలు) భక్తియార్ ఖిల్జీ, ఔరంగజేబులను కూడా ఓడించి అస్సాం సార్వభౌమాధికారాన్ని కొనసాగించారు. పల్లవ సామ్రాజ్యం 600 సంవత్సరాలు పాలించింది. చోళులు 600 సంవత్సరాలు పాలించారు.
‘మౌర్యులు మొత్తం దేశాన్ని ఆఫ్ఘనిస్తాన్ నుండి లంక వరకు 550 సంవత్సరాలు పాలించారు. శాతవాహనులు 500 సంవత్సరాలు పాలించారు. గుప్తులు 400 సంవత్సరాలు పరిపాలించారు. (గుప్త చక్రవర్తి) సముద్రగుప్తుడు మొదటిసారిగా అఖండ భారతదేశాన్ని దర్శించి, దేశం మొత్తంతో సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కానీ వాటిపై ఎలాంటి రిఫరెన్స్ బుక్ లేదు’ అని అన్నారు.
‘ఈ సామ్రాజ్యాలపై రిఫరెన్స్ పుస్తకాలు రాయాలని ఆయన కోరారు. అవి వ్రాసినట్లయితే, మనం తప్పుగా భావించే చరిత్ర క్రమంగా మసకబారుతుందన్నారు. ఫలితంగా నిజం బయటపడుతుంది’ అని హోం మంత్రి తెలిపారు.