హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది సయ్యద్ సలాహుద్దీన్ పాక్‌లోనే ఉన్నట్టు తెలిసి పోయింది. రావల్పిండి వీధుల్లో అతను స్వేచ్ఛగా తిరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడైన బషీర్ అహ్మద్ పీర్ అంత్యక్రియల్లో అతను పాల్గొన్నాడు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. వీడియోలో సలాహుద్దీన్ ను పాక్ సైన్యం చుట్టూ కాపలాగా ఉండి పీర్ అహ్మద్ పీర్ అంత్యక్రియలకు తీసుకు వెళ్తున్న దృశ్యాలు కన్పిస్తున్నాయి. నివేదికల ప్రకారం, పాకిస్తాన్‌లోని రావల్పిండిలో సురక్షిత ప్రాంతంలో అహ్మద్ పీర్ అంత్యక్రియలు జరిగాయి.
భారత్ ను నాశనం చేస్తానంటూ సలాహుద్దీన్ ప్రతిజ్ఞ చేయడం, అతని చుట్టూ ఉన్న పాక్ సైన్యం అతని ఉత్సాహ పరచడం వీడియోలో కనిపిస్తోంది. ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)ను పాక్ తప్పుదోవ పట్టిస్తోందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు.
ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందన్ని ఆరోపణల మేరకు పాక్ పై ఎఫ్ఏటీఎఫ్ ఆంక్షలు విధించింది. పాక్ ను గ్రే లిస్టులో చేర్చింది. నాలుగు సంవత్సరాల తర్వాత పాక్ ను ఆ జాబితా నుంచి ఎఫ్ఏటీఎఫ్ తొలగించింది. తాజాగా ఈ షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో ఎఫ్ఏటీఎఫ్ కు పాక్ తప్పుడు సమాచారం ఇచ్చిందని స్పష్టమవుతోంది.
ఎవరు ఈ బషీర్ అహ్మద్ పీర్…!
బషీర్ అహ్మద్ పీర్ ను 4 అక్టోబర్ 2022న చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఉగ్రవాదిగా కేంద్రం ప్రకటించింది. ఉగ్ర సంస్థల వ్యాప్తికి సహాయం చేయడంతో అతన్ని ఉగ్రవాదుల జాబితాలో కేంద్రం చేర్చింది. ఉగ్రవాదులకు లాజిస్టిక్ సహాయం చేశాడని, జమ్ములోని కుప్వారాలో ఉగ్రమూక చొరబాటుకు సహాయం అందించాడని కేంద్ర హోం శాఖ తన నోటిఫికేషన్ లో పేర్కొంది.