– వరుసగా నాల్గోరోజు అక్రమ నిర్మాణాల కూల్చివేత
– ఐదు మున్సిపాలిటీల పరిధిలో 12 నిర్మాణాలపై చర్యలు
– ఇప్పటిదాకా 45 నిర్మాణాలు కూల్చివేత
సరైన అనుమతులు లేకుండా నగరంలో, శివారు ప్రాంతాల్లో ఇష్టం వచ్చినట్లు చేపడుతున్న నిర్మాణాలు ఎన్నో. ఏదో అడపాదడపా చర్యలు తీసుకోవడం వల్లే ఎటుచూసినా అక్రమ నిర్మాణాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈసారి అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లే కనిపిస్తోంది.
సరైన అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, గోదాములను వరసగా నాల్గో రోజు కూల్చివేశారు అధికారులు. మున్సిపల్ చట్టం పరిధికి లోబడి అక్రమ నిర్మాణాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ ప్లానింగ్ అధికారులు, హెచ్ఎండీఏ ఎన్ ఫోర్స్ మెంట్ యంత్రాంగం సంయుక్తంగా ఈ డ్రైవ్ నిర్వహిస్తోంది.
సోమవారం మొదలైన ఈ స్పెషల్ డ్రైవ్ లో ఇప్పటిదాకా 45 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. గురువారం కొంపల్లి(5), నార్సింగి(3), తుర్కయంజాల్(2), శంషాబాద్(1), కొత్తూరు(1) మున్సిపాలిటీల పరిధిలో చర్యలు తీసుకున్నారు.
మొత్తం ఐదు మున్సిపాలిటీల పరిధిలో నాల్గోరోజు 12 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. ఈ డ్రైవ్ ను ఇలాగే కొనసాగిస్తే.. అక్రమ కట్టడాలకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు ప్రజలు.