– ఆగని ఫ్లెక్సీల యుద్ధం
– బీజేపీని టార్గెట్ చేస్తూ వెలుస్తున్న బ్యానర్లు
– కవిత విచారణ సందర్భంగా మోడీ ఫ్లెక్సీలు
– షా టూర్ నేపథ్యంలో వాషింగ్ పౌడర్ బ్యానర్లు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి.. ఎమ్మెల్సీ కవితను ఈడీ ప్రశ్నించింది. విచారణ సమయంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఆదివారం హకీంపేట్ లోని సీఐఎస్ఎఫ్ శిక్షణా కేంద్రంలో జరిగిన 54వ సీఐఎస్ఎఫ్ రైసింగ్ డే పరేడ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. శాంతిభద్రతలు సురక్షితంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. దేశంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సీఐఎస్ఎఫ్ పటిష్ట భద్రత కల్పిస్తోందని తెలిపారు.
అయితే.. షా తెలంగాణ పర్యటన సందర్భంగా నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో బీజేపీలో చేరిన అవినీతి లీడర్లపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తోంది. అప్పటిదాకా దర్యాప్తు సంస్థల కేసులు ఎదుర్కొన్న లీడర్లు.. బీజేపీలో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా మాదిరి క్లీన్ గా ఎలా అవుతారని ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
శనివారం.. ఓవైపు కవిత, మరోవైపు ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతల చిత్రాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విపక్ష నేత బీజేపీలో చేరితే అతనిపై ఎలాంటి విచారణ జరగదని, దానికి విరుద్ధంగా మరక నుంచి బయటపడతారని వాటిలో చూపించారు. అలాగే, మోడీని రావణాసురుడిలా చూపిస్తూ బ్యానర్లు కట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
అయితే.. షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో కూడా హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. వాటిపై వాషింగ్ పౌడర్ నిర్మా.. వెల్ కమ్ టు అమిత్ షా అని రాసి ఉంది. బీజేపీ నేతలు హిమంత బిశ్వశర్మ, నారాయణ రాణే, సువేందు అధికారి, సుజనా చౌదరి, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు నేతల ఫొటోలను వాషింగ్ పౌడర్ నిర్మా యాడ్ లో కనిపించే అమ్మాయి ఫోటోకు అతికించారు. ఎంత అవినీతికి పాల్పడినా బీజేపీలో చేరితే మరకలు పోతాయనే అర్థం వచ్చేలా వీటిని పెట్టారు.