హోలీల సందర్భంగా జనం రంగులే కాకుండా కోడిగుడ్లు, టమాటోలు, వాటర్ బెలూన్లు వగైరాల్లాంటివి లాంటివి చల్లుకుంటారు.పండుగ పక్కనబెడితే మామూలుగా అవి వంటి మీద పడితేనే తేళ్ళూ జెర్రిలు పాకినట్టుగా ఉంటుంది.
అలాంటిది హోలీ ఆటల్లో నిజంగానే తేళ్ళు విసురుకుంటే ఎలా ఉంటుంది.!? తేళ్ళంటే ఏదో అల్లాటప్పా తేళ్ళు కాదు.వాటిని చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అవి మీద పడితే ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చెయ్యండి.
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో హోలీవేడుకల్లో ఈ వింత సాంప్రదాయం ఉంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఉస్రాహర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తఖా తహసిల్ ప్రాంతంలోని సౌత్నా గ్రామంలో భైసన్ అనే శతాబ్దాల నాటి కోట ఉంది.
ఈ కోటలో వేలాది ఇటుకలు, రాతి ముక్కలు పడి ఉన్నాయి. సాధారణంగా ఈ ఇటుకలను తీసినప్పుడు ఎటువంటి జంతువులు కనిపించవు. కానీ హోలీపౌర్ణమి రెండవ రోజు సాయంత్రం కాగానే..ఇటుకలు, రాళ్ల మధ్య నుండి వేలాది విషపూరితమైన తేళ్లు బయటకు రావడం ప్రారంభిస్తాయి.
ఆ సమయంలో అక్కడకు గ్రామంలోని పెద్దలు, పిల్లలు చేరుకుంటారు. ఆ మట్టిదిబ్బ దగ్గరికి చేరుకుని.. పెద్దలు, పిల్లలు ఆ తేళ్లను తమ చేతుల్లోకి ఎత్తుకొని ఒకరిపై ఒకరు విసురుకుంటూ హోలీ ఆడతారు.
హోలీ పాట ప్రారంభమైన వెంటనే కోట లోపల నుండి తేళ్లు బయటకు రావడం ప్రారంభమవుతాయని, హోలీ రోజున తేళ్లు ఏ మనిషిని కాటేవని గ్రామంలో నివసించే ప్రజలు అంటున్నారు. పిల్లలు చేతుల్లో తేళ్లు పట్టుకుని తిరుగుతుంటారు.. ఆ తేళ్లు పిల్లలతో చాలా హాయిగా ఆడుకుంటాయి.
ఈ గ్రామానికి చెందిన ప్రజలు.. ఈ తేళ్లను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు. ఈ తేళ్లపై ఎవరూ దాడి చేయరు. అలాగే వాటిని చంపడానికి కూడా ప్రయత్నించరు.
ఈ తేళ్లు పూర్తిగా సురక్షితం.. దీంతో గ్రామస్తులందరూ హొలీ రోజున ఆ తేళ్లను చేతులతో పట్టుకుని.. ఒకరిపై ఒకరు తేళ్లు విసురుకుంటూ హోలీని జరుపుకుంటారు.
గుట్టలోంచి ఇటుకలు తీసిన తర్వాత తేళ్లు ఇంటి నుంచి బయటకు రావడం ప్రారంభిస్తాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కోటలోని తేళ్లు హొలీకి ముందు తర్వాత సర్వసాధారణంగా ఎవరికీ కనిపించవు.
కానీ హోలీ తర్వాత పొరపాటున ఎప్పుడైనా తేళ్లు బయటకు వస్తే..అవి కుడితే శరారంలో విషం వ్యాప్తిస్తుందని తెలిపారు. కానీ హోలీ రోజును ఇక్కడి తేళ్ళకు విషయం ఉండదని వివరించారు.
మొఘల్ పాలనలో కూల్చివేయబడిన కోటలో తూర్పున ఒక ఆలయం ఉండేది. ఈ గుట్టపై విగ్రహాల అవశేషాలు లభ్యమయ్యాయి. పూర్వం ఈ ఆలయంలో గేదెలను బలి ఇచ్చారని పూర్వీకులు చెబుతారు. ఎవరైనా ఈ గుట్టలోంచి ఒక్క ఇటుక, రాయి తీసుకున్నా ఆ వ్యక్తి ఇంట్లోకి తేళ్లు రావడం మొదలవుతాయని చెప్పారు.