తెలంగాణ వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. సోమవారం రాత్రి కామదహనంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. చిన్నపెద్దా అంతా కలిసి రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. హైదరాబాద్ లోని పలు వ్యాపార సంస్థలు హోలీ వేడుకల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాయి. బేగం బజార్ లో రాజస్థాన్ సమాజ్ కు చెందిన కుటుంబాలు మిఠాయిలు తింటూ.. రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాల మధ్య హోలీని జరుపుకున్నారు. రాజస్థానీ మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ, డ్యాన్సులు చేశారు.
హైదరాబాద్ ఇందిరాపార్క్ వాకర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నగర డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. హిందూ సంప్రదాయాలు, ధార్మిక సిద్ధాంతాలకు ప్రతీకగా నిలిచే పండుగలను విశ్వవ్యాప్తం చేయాలని తలసాని కోరారు. అలాగే గోషామహల్ లో జరిగిన హోలీ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు.
మెదక్ జిల్లా రామాయంపేటలో సంప్రదాయబద్ధంగా యువకులు మోదుగపూలతో తయారు చేసిన సహజమైన రంగులతో హాలీ పండుగ జరుపుకున్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో చిన్నారులు, వృద్ధులు స్టెప్పులతో అదరగొట్టారు.
వరంగల్ లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్ద రంగులు పూసుకుంటూ రంగుల్లో తడిసి ముద్దయ్యారు. తీన్మార్ డప్పులకు డ్యాన్సులు చేస్తూ వాడవాడలూ తిరిగారు.
ఖమ్మంలో హోలీ సంబరాలు ఆకాశాన్నంటాయి. ఒకరిపై ఒకరు రంగులు వేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఖమ్మం పోలీస్ పరేడ్ మైదానంలో హోలీ వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ ఆధ్వర్యంలో వసంతోత్సవం నిర్వహించారు. తీన్మార్ డప్పు శబ్ధాలకు డ్యాన్సులు చేశారు.