రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. డెల్టాకు ఒమిక్రాన్ తోడవడంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం కేసీఆర్. మంత్రి హరీష్ రావుతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
ఇటు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వీటిలోనే సంక్రాంతి సెలవులు అయిపోతాయి కాబట్టి… అవి అయిపోయే టైమ్ కి కరోనా కేసుల తీవ్రతను బట్టి సెలవులు పొడిగించాలా లేదా? అనేది అప్పుడు నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు రాష్ట్రంలో పరిస్థితుల గురించి అధికారులు నివేదిక సమర్పించారు. ప్రస్తుతానికి లాక్ డౌన్ అవసరం లేదని సీఎంకు వివరించారు. ఒమిక్రాన్ పట్ల భయం అవసరం లేదన్న కేసీఆర్.. అదే సమయంలో అజాగ్రత్త పనికిరాదని తెలిపారు. అందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించాలని సూచించారు. కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ బెడ్స్, మందులు సమకూర్చుకోవాలని తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో తాజాగా 482 మందికి కరోనా సోకినట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 6,82,971కి చేరింది. సోమవారం మొత్తం 38,362 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,048 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా వైరస్ నుంచి కోలుకుని 212 మంది ఇళ్లకు వెళ్లారు.