దేశ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణలో సమధర్మాన్ని పాటించడం కోసం భారత న్యాయ వ్యవస్ధ పర్యావరణ ధర్మాన్ని పునఃనిర్వచిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో శనివారం అంతర్జాతీయ న్యాయ సదస్సును ప్రారంభించిన అనంతరం ప్రధాన మంత్రి ప్రసంగించారు. లింగ న్యాయం గురించి ప్రస్తావిస్తూ…ఇది లేకుండా ప్రపంచంలో ఏ దేశం నిజమైన అభివృద్ధి సాధించలేదన్నారు. ట్రాన్స్ జెండర్స్ చట్టాలు, ట్రిపుల్ తలాఖ్, దివ్యాంగుల చట్టాలు ఇలా ప్రభుత్వం ఎన్నో చట్టాలు తీసుకొచ్చింది… సైన్యంలోని మహిళల హక్కులు కాపాడడం కోసం వారికి 26 వారాల పెయిడ్ మెటర్నటీ లీవ్స్ ఇచ్చామని చెప్పారు.
టెక్నాలజీ గురించి మాట్లాడుతూ…కోర్టు ప్రక్రియల్లో సాంకేతికత వినియోగం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని..న్యాయం చాలా త్వరగా అందుతుందని చెప్పారు.మారుతున్న కాలంలో డేటా ప్రొటెక్షన్, సైబర్ నేరాలు న్యాయ వ్యవస్థకు కొత్త సవాళ్లుగా ఎదురవుతున్నాయన్నారు. ఇటీవల వచ్చిన కోర్టు తీర్పులను నూట ముప్పై కోట్ల మంది ప్రజలు హృదయపూర్వకంగా ఆహ్వానించారని తెలిపారు.
సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోబ్డే మాట్లాడుతూ…భారత దేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనమన్నారు. మొఘల్స్, డచ్, పోర్చ్ గీస్, ఇంగ్లీష్ సంస్కృతులున్నాయన్నారు. రాజ్యాంగం మనకు బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థను ఇచ్చిందని…దాని ప్రాధమిక లక్షణాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.