ఢిల్లీలోని జహంగీర్ పురిలో హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశించారు. జహంగీర్ పురిలో హింసాత్మక ఘటనపై కేంద్ర మంత్రికి ఢిల్లీ సీనియర్ పోలీసు అధికారులు కేంద్ర హోం మంత్రికి నివేదిక అందజేశారు.
అనంతరం డిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ అస్తానాతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఘటన ప్రారంభం అయినప్పటి నుంచి అస్తానాతో అమిత్ షా మాట్లాడటం ఇది రెండో సారి కావడం గమనార్హం. అస్తానతో పాటు ఢిల్లీ లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమిషనర్ దీపేంద్ర పాతక్ తో అమిత్ షా సోమవారం మాట్లాడారు.
ప్రస్తుతం ఆ ఏరియాలో పరిస్థితులను గురించి వారిని అడిగి అమిత్ షా తెలుసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని వారిని ఆయన ఆదేశించారు. ఈ కేసు దర్యాప్తును కేంద్ర హోం శాఖ కూడా పర్యవేక్షిస్తుందని తెలిపినట్టు సమాచారం.
అంతకు ముందు ఈ కేసు దర్యాప్తు కోసం 14 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్టు ఢిల్లీ కమిషనర్ రాకేశ్ అస్తానా తెలిపారు. ఇప్పటి వరకు అల్లర్లకు సంబంధించి 23 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నామని త్వరలోనే మరికొంత మందిని అరెస్టు చేస్తామని వివరించారు.