వరంగల్ కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్న ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ విద్యార్థి సైఫ్ అనే వ్యక్తి.. హోమ్ మంత్రి మహమూద్ అలీకి బంధువని ఆరోపించారు.
అందువల్లే అతన్ని కాపాడేందుకు ఈ కేసును తప్పుదోవ పట్టిస్తున్నారంటూ బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. సైఫ్ వేధిస్తున్నాడని ప్రీతి తల్లిదండ్రులు కంప్లైంట్ చేసినా కేఎంసీ యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంతోనే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందని అన్నారు. బాధితురాలితో సైఫ్ అసభ్యంగా ప్రవర్తించాడనడానికి ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.
ఇటీవలే మెదక్ పోలీసుల చేతిలో దెబ్బలు తిని మరణించిన ఖదీర్ ఖాన్ మరణంపై నోరు మెదపని మహమూద్ అలీ.. ప్రీతి కేసులో మాత్రం తన బంధువైన సైఫ్ ను కాపాడాలనుకుంటున్నాడని విమర్శించారు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్.
కాగా వరంగల్ కేఎంసీ మెడికల్ స్టూడెంట్ ప్రీతి కేసులో నిందితుడు సైఫ్ ను శుక్రవారం ఉదయం హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు సైఫ్ ను వరంగల్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. ఆ తర్వాత సైఫ్ ను ఖమ్మం జైలుకు తరలించనున్నారు.