భారత్, చైనా మధ్య సరిహద్దు సమస్య రోజు రోజుకి మరింత జఠిలంగా మారుతోంది. బార్డర్ ఇష్యూపై వాస్తవాలు చెప్పేందుకు భయపడుతోందంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టి వేళ.. కేంద్రం స్పష్టతనిచ్చేందుకు సిద్ధమైంది. చైనాతో తలెత్తిన సరిహద్దు వివాదంపై ఇవాళ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నారు.
వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట నెలకొన్న పరిస్థితిపై చర్చ చేపట్టాలని ఇప్పటికే విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవలే రష్యా పర్యటనలో రాజ్‌నాథ్ చైనా రక్షణ మంత్రి జనరల్ వెయ్ ఫెంగితో సమావేశమై సరిహద్దు సమస్యపై చర్చించారు. ఈ క్రమంలో మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో రాజ్‌నాథ్ ప్రకటన చేసే అవకాశాలన్నాయి. అయితే సరిహద్దుల్లో నెలకొన్న సమస్యను మాత్రమే వివరిస్తారా లేక.. పార్లమెంట్ వేదికగా చైనాకు సందేశం పంపిస్తారాన్న ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే భారత్‌ను కవ్వించేందుకుచైనా తరచూ ప్రయత్నిస్తోంది. తాజాగా వివాదాస్పద ప్రాంతంలో చైనా ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వేస్తూ భారత సైన్యాన్ని రెచ్చగొడుతోంది. ఇప్పటికే పాన్‌గాంగ్ లేక్ వద్ద చైనా దళాలు మోహరించడంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది.జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. అప్పటి నుంచి ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.