ఎంజీఎం ఎలుకల దాడిలో మరణించిన కడార్ల శ్రీనివాస్(37) కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఇంటి ఓనర్ రూపంలో మరో సమస్య ఎదురయింది. శ్రీనివాస్ మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు ఇంటి ఓనర్. దీంతో ఆ కుటుంబ సభ్యుల తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
భీమారం వాస్తవ్యుడైన కడార్ల శ్రీనివాస్ కొన్నేళ్లుగా హన్మకొండ కుమార్ పల్లిలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే కిడ్నీ సంబంధిత అనారోగ్యానికి గురై ఆస్పత్రుల్లో చికిత్స కొసం చేరాడు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందినప్పటికీ.. ఆరోగ్యం మెరగుపడకపోగా ఆర్థికంగా కుటుంబం చితికి పోయింది. దీంతో వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రి ఐసీయూలో జాయిన్ అయ్యాడు. అయితే.. అతడిపై ఎలుకలు దాడి చేశాయి.
అసలే కొన ఊపిరితో పోరాడుతున్న శ్రీనివాస్ కు తీవ్ర రక్తసావ్రమై పరిస్థితి మరింత విషమించింది. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే శ్రీనివాస్ ను నిమ్స్ కు తరలించింది. అయితే.. చికిత్సపొందుతూ శనివారం తెల్లవారుజామున అతను మరణించాడు.
అయితే.. శవాన్ని అద్దె ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు యత్నించగా ఇంటి యజమాని నిరాకరించాడు. దీంతో భీమారంలోని శ్రీనివాస్ మృతదేహాన్ని తన సోదరుడి ఇంటికి తీసుకెళ్లారు. సమీపంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశారు కుటుంబ సభ్యులు.