టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ పేపర్ లీకేజీ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసుల దర్యాప్తులో కంప్యూటర్ హ్యాకింగ్ జరగలేదని నిర్థారణ అయింది. ఓ యువతి మాయలో పడి టీఎస్పీఎస్సీ ఉద్యోగి పేపర్ లీకేజీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ కీలక నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
గత కొంత కాలంగా ఓ యువతి ప్రవీణ్ తో సన్నిహితంగా ఉంటుందని, తరుచూ ప్రవీణ్ ను కలిసేందుకు యువతి ఆఫీస్ కు వచ్చేదని, ప్రవీణ్ తో ఆ యువతి సన్నిహితంగా ఉండేదని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పేపర్ ఇవ్వాలని యువతి ప్రవీణ్ ను కోరింది. దీంతో ప్రవీణ్ ఆమె కోసమే టౌన్ ప్లానింగ్ పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
సెక్రటరీ పీఏ ప్రవీణ్ తో సహా ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణలో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పేపర్ లీకేజీ ఘటనలో భాగంగా ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ పరీక్షతో పాటు, మార్చి 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షను సైతం వాయిదా వేశారు టీఎస్పీఎస్సీ అధికారులు. ఈ మేరకు శనివారం రాత్రి కమిషన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. అయితే వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.