ఢిల్లీలోని ఓ ఆస్పత్రిల్లో హోమం నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. ద్వారకా ప్రాంతంలోని మణిపాల్ హెల్త్ హాస్పిటల్‌లో హోమానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ఆస్పత్రి యాజమాన్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ద్వారకాలోని మణిపాల్ హెల్త్ హాస్పిటల్ భవనంలో ఇటీవల హోమం నిర్వహించారు. శ్వాస కోస సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓ రోగి కోసం ఈ హోమాన్ని నిర్వహించినట్టు ఓ జర్నలిస్టు వెల్లడించారు. హోమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు.
సెంట్రల్ ఏసీ వున్న ఆస్పత్రి ఎంట్రన్స్ వద్ద హోమాన్ని నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. ఆ ఫోటోకు దేవుడా మమ్మల్ని రక్షించు అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆస్పత్రి యాజమాన్యంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఫైర్ డిటెక్షన్ వ్యవస్థలను ఆపి వేసి మరి హోమం నిర్వహించారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. హోమం సమయంలో వెలుపడే పొగ రోగులపై ప్రభావం చూపుతుందంటున్నారు. ఇది చాలా సీరియస్ గా పరిగణించాల్సిన విషయమని నెటిజన్లు చెబుతున్నారు.
రెండేండ్ల క్రితం డెల్లా వేరియంట్ కేసులు పెరిగిన సమయంలోనూ ఆ ఆస్పత్రిలో హోమం చేశారంటూ మరో నెటిజన్లు దానికి సంబంధించిన పాత ఫోటోలను షేర్ చేశారు. దీనిపై ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనపై క్షమాపణలు చెప్పింది. దీనిపై తమ బృందం తగిన చర్యలు తీసుకుంటుందని బదులిచ్చింది.